Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
ఉండవల్లి శ్రీదేవి అనూహత్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. దళిత మహిళ అయిన ఆమె 2019ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఉండవల్లి శ్రీదేవి... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఏపీ రాజకీయాల్లో ఈ పేరు హాట్ టాపిక్ అయిన ఆ నలుగురులో ఆమె ఒకరు. దీంతో ఆమె రాజకీయ ప్రస్థానంపై అందరూ వివరాలు చెక్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన మహిళా దళిత శాసన సభ్యురాలు. చివరకు సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురికావటం సంచలనంగా మారింది.
అనూహ్యంగా రాజకీయాల్లోకి....
ఉండవల్లి శ్రీదేవి అనూహత్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. దళిత మహిళ అయిన ఆమె 2019ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు వరకు ఆమె హైదరాబాద్ లో స్థిరపడి, వైద్యురాలుగా పని చేశారు. రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్న ఉండవల్లి శ్రీదేవిని స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అత్యంత కీలకం అయిన తాడికొండ నియోజకవర్గ సీటును ఆమె కేటాయించగా.. అనూహ్యంగా ఆమె విజయం సాధించారు. అమరావతి రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అప్పటివరకు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీని కాదని రాజధాని ప్రాంతానికి చెందిన రైతులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో ఆమె రాజకీయల్లోకి వచ్చిన కొత్తలోనే ఎవ్వరూ ఊహించని విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాదించారు.
ఆది నుండి వివాదాలే...
ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన తరువాత ఆమె విజయం సంచలనంగా మారింది. అయితే అది ఎక్కువ సేపు నిలువలేదు. ప్రతిపక్షాల కన్నా సొంత పార్టీకి చెందిన నేతల నుండే ఆమెకు ఇబ్బందులు మెదలయ్యాయి. తన నియోజకవర్గంలో బాపట్ల పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయిన నందిగం సురేష్ జోక్యం చేసుకోవటం, ఆయన అనుచరులను ప్రోత్సహించటం, పార్టీ బ్యానర్లలో మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫోటోలు ముద్రించకపోవటం పై వివాదం మెదలైంది. దీంతో నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవి మద్య వివాదం తారా స్థాయికి చేరి ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు గొడవలకు దిగారు. పోలీస్ స్టేషన్ లో పంచాయితీలకు వర్గ పోరు వివాదం వెళ్లింది. దీంతో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకొని ఇద్దరితో మాట్లాడి రాజీ కుదిర్చారు. అయితే అది ఎక్కువ కాలం నిలువలేదు. ఆ తరువాత తాడికొండ నియోజకవర్గంలో ఇసుక ర్యాంప్ ల విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్ మధ్య వివాదం తెర మీదకు వచ్చింది. తన నియోజకవర్గంలోని ఇసుక ర్యాంప్ లపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ జోక్యం చేసుకోవటం పై ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. ఈ వ్యవహారం సైతం పార్టీలో పెద్దలకు తలనొప్పగా మారింది.
పేకట శిబిరంతో పూర్తిగా వివాదాల్లోకి...
మంగళగిరిలో ఉన్న ఒక భారీ విల్లాలో పేకాట శిబిరం పై పోలీసులు దాడులు చేశారు. అందులో ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ కాగా, అందులో గ్యాంగ్ లీడర్ ఉండవల్లి శ్రీదేవి అనుచరుడు కావటంతో ఆ వ్యవహరం భారీ ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పేకాట శిబిరానికి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికి, అదే సమయంలో పేకాట శిబిరంపై ఆమె తన అనుచురుడితో మాట్లాడిన ఆడియో టేపులు వైరల్ గా మారాయి. అంతే కాదు, పార్టీ అధినేత జగన్, పార్టీలోని కీలక నేతలను ఉద్దేశించి ఉండవల్లి శ్రీదేవి మాట్లాడిన మాటలు సైతం ఆడియో రూపంలో వెలుగు లోకి వచ్చాయి. దీంతో ఆమె వివాదాలు తారా స్థాయికి చేరాయి. సొంత పార్టీకి చెందిన నేతలే ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఇలా వరుసగా వివాదాల్లో చిక్కుకున్న శ్రీదేవి తాజాగా అసెంబ్లీ సాక్షిగా జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే అభియోగం పై స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ ఆమెతో పాటు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.