Gudivada Amarnath: ముందు లోకేశ్ బ్రెయిన్‌కి ఆపరేషన్ చేయించాలి - మంత్రి గుడివాడ వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడుపై రౌడీ షీట్ తెరవాలని వైఎస్ఆర్ సీపీ తరపున డిమాండ్ చేస్తున్నట్లుగా గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
పుంగనూరు ఘటనలో గాయపడిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లుగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. పుంగనూరు ఘటనలో టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కావాలని గొడవ సృష్టించి లా అండ్ ఆర్డర్ ని తప్పు త్రోవ పట్టించే అంశం అని విమర్శించారు. పోలీసులు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. వేరే ప్రాంతంలో పర్యటన పెట్టుకుని.. మరో ప్రాంతంలో పర్యటన ఏర్పాట్లను చేయడం కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబు నాయుడే అని అన్నారు.
పోలీసులు వ్యాన్ లు తగలపెట్టడం వంటివి చేసి పోలీసులని రెచ్చగొట్టి వారు చేసే ఫైరింగ్ లో ఒకరిద్దరు ప్రాణాలు పోతే సింపతీ గెయిన్ చేసే ఆలోచనలో వారు ఉన్నారని గుడివాడ అమర్ నాథ్ అన్నారు. పోలీసులు మీదకే రాళ్ళు విసిరి పోలీసులతో వైరం పెంచుకుంటున్నారని ఆరోపించారు. ‘‘ప్రాణాలు పోయినా పర్లేదు అనే ధోరణి కనపడుతోంది. యాబై మంది వరకు గాయాలు అయ్యాయి. పోలీసుల మీద ఇంత జరిగితే ఎల్లో మీడియాకి కనపడాలేదా? చంద్రబాబు నాయుడు స్కెచ్ లో భాగమే.. ఈ సంఘటనతో చంద్రబాబు నాయుడుపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఇంత క్రిమినల్ మైండ్ సెట్ తో చేశారు’’ అని గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
చంద్రబాబు నాయుడుపై రౌడీ షీట్ తెరవాలని వైఎస్ఆర్ సీపీ తరపున డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు. చంద్రబాబు నాయుడు సొం జిల్లాలో ఏ ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలవలేదు అనే కోపంతో ఇవన్నీ చేశారని అన్నారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి చాలా సహనంతో ఓపికతో కంట్రోల్ చేస్తే ఆయనపై కూడా అవాకులు చవాకులు పేలుస్తున్నారని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ లో ఫస్ట్ పేజీ రిషాంత్ రెడ్డిదే అంటూ చిన్న పిల్లాడిలా ప్రవర్తించారని అన్నారు.
‘‘జగన్ మోహన్ రెడ్డిపై ఎలా పడితే అలా మాట్లాడటం సరికాదు. పోలీసుకి కన్ను పోతే లోకేష్ ఆపరేషన్ చేయిస్తా అంటున్నారు.. ఆపరేషన్ అంటూ చేయిస్తే ముందు లోకేష్ బ్రైన్ కి చేయాలి. పోలీసులకి వర్క్ ఫ్రం హోం ఇస్తానని చంద్రబాబు నాయుడు అనడం హాస్యాస్పదం. పుంగనూరు ప్రోగ్రాం షెడ్యూల్ లో ఇవ్వలేదు.. అక్కడకి వచ్చి పోలీసుల్ని రెచ్చగొట్టడం ఎంతవరకు సబబు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉందని అని చెప్పడం, ఎవరిని పడితే వాళ్ళపై తిరగబడతాను అంటే ఎలా కుదురుతుంది. వైసీపీ వారే అక్కడ లేరు.. అసలు ఆ గొడవ జరిగింది పోలీసులకి టీడీపీ వారికి’’
చంద్రబాబు నాయుడు ఎంత కాలం జీవించి ఉంటే వైసీపీకి అంత లాభం. పోలీసులపై తిరుగుబాటు చేస్తాం అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ళు రువ్వితే మా ప్రభుత్వానికే ఇబ్బంది’’ అని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
చిరంజీవి వ్యాఖ్యలపైనా స్పందన
పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడొద్దని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. చిరంజీవి ముందు అతని తమ్ముడికి చెప్పాలని అన్నారు. చిరంజీవి అంటే తమకు ప్రత్యేకమైన గౌరవం ఉందని అన్నారు.