Floods Fear: వరదలు వస్తాయనే భయంతో వలసలు, ఏపీ నుంచి తెలంగాణకు!
Floods Fear: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలు మళ్లీ వరదలు వస్తాయోమో న్న భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎపీ నుంచి తెలంగాణకు వలస వెళ్తున్నారు.
Floods Fear: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా అంధ్ర ప్రదేశ్ లో చాలా మంది సర్వం కోల్పోయారు. తినేందుతు సరిగ్గా తిండి లేక, తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరక్క నానా అవస్థలు పడ్డారు. అయితే గత నాలుగు రోజుల నుంచి మళ్లీ వర్షం మొదలైంది. దీంతో ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మళ్లీ ఎక్కడ భారీ వర్షాలు కురిసి వరదల కారణంగా తమ గ్రామాలు నీట మునిగిపోతాయోమోనని ఆవేదన చెందుతున్నారు. ఇక మళ్లోసారి ఆ కష్టాన్ని కళ్ల చూడకూడదని తెలంగాణకు వలస వస్తున్నారు. పిల్లాజెల్లాతో సహా తట్టా బుట్టా సర్దుకొని మరీ వెళ్లిపోతున్నారు.
మినీ లారీలో సామగ్రి తరలిస్తూ.. వలస!
ముఖ్యంగా గోదావరి వరదలు విలీన మండలాల ప్రజలను అతలాకుతలం చేశాయి. మరోసారి వరద వచ్చే ప్రమాదం ఉందనే భయంతో వరరామ చంద్రపురం, కూనవరం మండల్లాలోని కొందరు ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రానికి తరలి వెళ్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామ చంద్రపురం మండలం నుంచి మినీ లారీలో సామాగ్రిని తరలిస్తున్న బాధితులు మంగళవారం ఎటపాక మండలం నందిగామ వద్ద కనిపించారు. ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో గదులు అద్దెకు తీస్కొని..
ఇప్పటికే భారీ వరదల కారణంగా వచ్చిన నీటితో తమ గ్రామాలన్నీ జలమయం అయ్యాయని తెలిపారు. అప్పుడు తాము పడ్డ కష్టాలు మరోసారి పడకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా ఒకసారి పూర్తిగా నష్టపోయిన తాము.. మరోసారి వరదలు వస్తే తట్టుకునే ఓపిక లేదని చెప్పారు. తెలంగామలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గదులు అద్దెకు తీసుకొని సామగ్రి అక్కడకు తరలిస్తున్నామని చెప్పారు. ఆగస్టులో మరింత ఎక్కువ వరద వస్తుందని.. వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారని వాపోయారు. ప్రతి ఏటా ఇలా ఇబ్బందులు పడుతూనే ఉన్నామని.. ఇక ఇప్పుడే తట్టుకునే ఓపిక లేకే తెలంగాణకు వలస వెళ్తున్నామంటూ కన్నీరు మున్నీరయ్యారు.
మొన్నటి వానకే ఇప్పటికీ కోలుకోని గ్రామాలు..
ఏది ఏమైనప్పటికీ.. మొన్నటి వరకు కురిసిన భారీ, వర్షాలు వరదల కారణంగా ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ముంపు ప్రాంతాలకు గురైన గ్రామాల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పది, పదిహేను రోజుల పాటు మోకాళ్ల లోతు నీటిలోనే ఉండిపోయారు. తిండి, బట్ట, మంచి నీళ్లు లేక ఆకలితో అలమటించారు. వరదలు తగ్గినా చాలా గ్రామాలకు విద్యుత్ సమస్యలు, రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయ కల్గింది. లక్షల ఎకరాల పంట నీట మునిగింది. వేలాది పశువులు ప్రాణాలు కోల్పోయి... అన్నదాత కంట్లో నీరే మిగిల్చాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకే ఇప్పటికీ చాలా గ్రామాలు కోలుకోలేక పోతుండగా.. మరోసారి వరుణుడు విజృంభించి వారిని మరింత ఆగం చేస్తున్నాడు.