Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు
Michaung Cyclone Effect: కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన, వాణిజ్య పంటలకు తీరని నష్టం వాటిల్లింది. వరద నీరు, భారీగా వీచే తుపాను గాలులకు చెట్లు నేలకొరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. కోతకు వచ్చిన పంట నీట మునిగింది. కోత కోసిన పంట తడిసి ముద్దైంది. చేతికి వచ్చిన పంటను ఇలా నీళ్ల పాలు కావడంతో అన్నదాత బోరుమంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తుపానుతీరం దాటింది. అయినా దాని ఎఫెక్టో ఇప్పటికీ కనిపిస్తోనే ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. దీని కారణంగా వ్యవసాయ పనులు చేయడం ఇబ్బందిగా మారింది.
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన, వాణిజ్య పంటలకు తీరని నష్టం వాటిల్లింది. వరద నీరు, భారీగా వీచే తుపాను గాలులకు చెట్లు నేలకొరిగాయి. కొబ్బరి, అరటి లాంటి పంటలపై కోలుకోలేని దెబ్బ పడిందని రైతులు వాపోతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 8 జిల్లాల్లో 50కిపైగా మండలాల్లో తుపాను ప్రభావం కనిపిస్తోంది. వరి, అరటి, పత్తి, జీడిమామిడి, కూరగాయలు పండించే రైతులు అందరి కంటే ఎక్కువ నష్టపోయారు.
వర్షాల కారణంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. రోడ్లు జలమయం అయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలు తడిసి ముద్దైపోయాయి. చాలా చోట్ల విద్యుత్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా మందికి పునరావాసాలకు తరలించినా అక్కడ సౌకర్యాలు లేవని ప్రజలు వాపోతున్నారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. కనీసం భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.