Pawan contest in Kakinada : కాకినాడలోనే పవన్ పోటీ - జనసేనాని డిసైడయ్యారా ?
Kakinada : కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మరోసారి అక్కడే మకాం వేయబోతున్నారు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాకినాడపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాకినాడలో ( kakinada ) 50 వార్డులు ఉంటే ఏయే వార్డులో ఏయే సామాజికవర్గాలు ఎక్కువగా ఉన్నాయో వారి పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే 28 వార్డుల పెద్దలతో మంతనాలు పూర్తి చేశారు పవన్ కల్యాణ్. మరో రెండు మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ మళ్లీ కాకినాడ వెళ్లబోతున్నారు. కాకినాడ టూర్ లో భాగంగా 22 వార్డులపై సమీక్ష నిర్వహించబోతున్నారని సమాచారం.
కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కల్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాకినాడ చుట్టు పక్కల విశాలమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాపై పడే అవకాశం ఉందని అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంపై పవన్ గతంలో చాలా సార్లు ఫైర్ అయ్యారు. ఆయన రౌడీ యిజాన్ని అణిచి వేస్తానన్నారు. గతంలో వారాహి యాత్ర జరిగినప్పుడు పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని ద్వారంపూడి సవాల్ చేశారు. అయితే అప్పటికే పవన్ కాకినాడ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని కానీ వైసీపీ ట్రాప్ లో పడటం ఇష్టం లేక ప్రకటన చేయలేదని అంటున్నారు.
ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉండటం.. కాకినాడ సిటీలో అత్యధికంగా కాపు సామాజికవర్గ ఓట్లు ఉండటం.. టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉండటంతో.. కాకినాడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే ద్వారంపూడిపై అసంతృప్తి ఉందని జనసేన వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ క్రమంలో రెండు, మూడు ప్రైవేటు సంస్థలతో సర్వేలు చేయించుకుంటే.. మంచి మెజార్టీతో గెలుస్తామని పలితం వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పవన్.. కాకినాడను ఫైనల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
గత ఎన్నికల్లోపవన్.. ప.గో జిల్లాలోని భీమవరం, విశాఖలోని గాజువాక నుంచి పోటీ చేశారు. కానీ రెండు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయనపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ సారి మరింత సేఫ్ సీటును రిజర్వ్ చేసుకున్నట్లుాగ తెలుస్తోంది. ఈ సారి పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని.. గెలుపు ముఖ్యం కాదని.. మెజార్టీ ముఖ్యమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో.. గట్టి చాలెంజ్ విసిరే వైసీపీ నేతలపై పోటీ చేసి గెలవాలనుకున్నారని అంటున్నారు. ద్వారంపూడితో కరెక్ట్ పోరు జరుగుతుదంని పవన్ డిసైడయినట్లుగా కనిపిస్తోంది.