వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ రీషెడ్యూల్- 10న రావాలని అవినాష్‌కు నోటీసులు- 12న భాస్కర్‌రెడ్డికి పిలుపు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో 10న విచారణకు హాజరుకావాలని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈసారి కచ్చితంగా హాజరుకావాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.
మాజీ మంత్రి, సీఎం జగన్‌కు బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేస్తున్న విచారణలో స్వల్ప మార్పులు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్‌రెడ్డిని ఇవాళ విచారణకు రావాలని రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది. అయితే తమకు ముందు నిర్ణయించుకున్న పనులు ఉన్నాయని రాలేమని తెలిపారు. దీంతో ఇవాల్టి విచారణనను సవరణ చేస్తూ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మార్చి 6న విచారణకు హాజరు కావాలని ఈ మధ్యే ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. అయితే తనకు ఆ రోజు ముందుగా షెడ్యూల్ చేసుకున్న పనులు ఉన్నందున రావడానికి వీలుపడదని చెప్పారు అవినాష్ రెడ్డి. దీంతో మరోసారి అర్థరాత్రి ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
అదే టైంలో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి విచారణను కూడా రీషెడ్యూల్ చేశారు. నాలుగు రోజుల కిందట ఈ నెల 12న విచారణకు రావాలని ఆదేశించారు. మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీనే రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇద్దరూ ఒకేసారి విచారణకు రావాలని తెలిపారు. కానీ అవినాష్‌రెడ్డి రిక్వస్ట్‌తో మార్పులు చేశారు.
వివేకా హత్యలో ఇప్పటికే అవినాష్‌రెడ్డిని రెండుసార్లు విచారించింది సీబీఐ. ఇప్పుడు ఆయన తండ్రిని కూడా విచారణకు పిలిచింది. హత్య జరిగిన రోజు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడం, హత్య వెనుక భారీ కుట్రను ఛేదించేందుకు ఆయన్ను విచారణకు పిలిచినట్లుగా భావిస్తున్నారు.
మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం !
సీబీఐ అధికారులు దర్యాప్తు విషయంలో చురుకుగా ఉన్నారని మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో విచారణకు పిలిచిన సీఎం జగన్, ఆయన సతీమణి పర్సనల్ అసిస్టెంట్లు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను ఇంకో సారి విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. కాల్ లిస్ట్ ఆధారంగా ప్రధానంగా విచారణ జరుగుతున్నందున.. వివేకా హత్య జరిగిన రోజున... ఆయన ఇంటి వద్ద నుంచి అనుమానాస్పదంగా ఫోన్లలో మాట్లాడిన వారిని గుర్తించి.. సీబీఐ ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఉమాశంకర్ రెడ్డి భార్యకు బెదిరింపు
వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిని ఇద్దరు దుండగులు బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పులివెందులలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో స్వాతి నివసిస్తుండగా, శనివారం ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దురుసుగా మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేసింది. వివేకాను చంపింది నీ భర్తే కదా అంటూ గదమాయించారని వాపోయింది. ఎస్పీ ఆదేశాలతో సీఐ రాజు తన సిబ్బందితో హుటాహుటిన ఆమె ఇంటి వద్దకు వెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు స్వాతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల మేరకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కడపకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.