Viral News: ఒకేసారి ఇద్దరు యువతులతో పెళ్లికి సిద్ధమైన యువకుడు, ఊహించని షాకిచ్చిన పోలీసులు
Sri Sathyasai District | ఇద్దరు అమ్మాయిలు, అది కూడా అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకునేందుకు సిద్ధమైన యువకుడికి, అతడి కుటుంబానికి సత్యసాయి జిల్లా పోలీసులు షాకిచ్చారు.

మొన్నామధ్య తెలంగాణలో ఓ యువకుడు ఒకే వేదిక మీద ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా బంధుమిత్రులు, వారి కుటుంబసభ్యుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. వాడి గుండె గట్టిదిరా.. వాడు చాలా గ్రేట్ అని నెటిజన్లు సైతం స్పందించారు. సరిగ్గా అలాంటి సీన్ ఏపీలో జరగాల్సి ఉంది. కానీ పోలీసులు ఆ వరుడికి షాకిచ్చారు. మరో రోజులు పెళ్లి ఉందనగా, వివాహాన్ని క్యాన్సిల్ చేపించారు.
అసలేం జరిగిందంటే..
నిడిగింటి వారి పెండ్లి పిలుపు అని ఓ వివాహ ఆహ్వాన పత్రిక గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఒకేసారి, ఒకే వేదిక మీద ఇద్దరు యువతులను వరుడు వివాహం చేసుకోబోతున్నాడు. ఏం నాయనా.. ఒకేసారి రెండు లడ్డూలు కావాలా అంటూ ట్రోలింగ్ సైతం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గమ్మయ్యగారిల్లి గ్రామానికి చెందిన నిడిగింటి గంగులమ్మ, నిడిగింటి రాజువేలు కుమారుడు గంగరాజుకు చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి పట్టణానికి చెందిన దంపతుల కుమార్తెలను గంగరాజుకు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు.
సత్యసాయి జిల్లా గోరంట్ల టౌన్ లోని రంగమహల్ కళ్యాణ మండలంలో వీరి పెళ్లి గురువారం ఏప్రిల్ 10న జరిపించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి రావడంతో వివరాలు సేకరించారు. వధువులు ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా, వారు మైనర్లు అని పోలీసులు గుర్తించారు. దాంతో యువకుడ్ని, అతడి కుటుంబసభ్యులను పిలిపించి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
మైనర్లను వివాహం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కనుక తమ మాట విని పెళ్లి క్యాన్సల్ చేసుకోవాలని హెచ్చరించారు. కేసుల్లో ఇరుక్కోవడం లాంటివి వినేసరికి ఆందోళనకు గురైన యువకుడి కుటుంబసభ్యులు వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పెళ్లి వేడుక ఎలా జరుగుతుందో చూద్దామని ఆశించిన వారికి సైతం నిరాశే ఎదురైంది. చట్టాన్ని అతిక్రమించి ఎవరూ తప్పిదాలకు పాల్పడవద్దని, ఎవరికైనా రూల్స్ ఒకటేనని పోలీసులు చెబుతున్నారు.






















