Konaseema Tiger : కోనసీమలో పత్తాలేకుండా పోయిన పెద్దపులి, రంగంలోకి తడోబా బృందాలు
Konaseema Tiger : కోనసీమ జిల్లా వాసుల్ని ఇంకా పులి భయం విడలేదు. పెద్ద మళ్లీ శరభవరం పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు అంటున్నా.. అడుగుజాడలు మాత్రం కనిపించడంలేదని అంటున్నారు.
Konaseema Tiger : కోనసీమ వాసుల్ని పులిభయం వీడలేదు. రెండు రోజుల క్రితం శరభవరంలో రెండు పశువులపై పంజా విసిరిన పెద్దపులి మళ్లీ పత్తాలేకుండా పోయింది. శరభవరం సరుగుడు తోటల్లో పెద్దపులి పాదముద్రల కోసం అటవీశాఖ అధికారులు గాలించారు. అయినా అటవీశాఖ అధికారులకు పులి జాడలు లభించలేదు. పులి సంచరిస్తున్న నేల అంతా పొడిగా ఉండడంతో పాదముద్రలు నేలపై కనిపించడంలేదని నిర్ధారణకొచ్చారు. అయితే సాయంత్రం అయితే చాలు శరభవరంతోపాటు సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆవుదూడ, గేదెపై పెద్దపులి దాడిచేసిన నేపథ్యంలో పశువులను పగటి పూట కూడా మేపేందుకు పొలాలకు తోలుకెళ్లడం లేదు రైతులు. మరో పక్క రాయల్ బెంగాల్ టైగర్ పంజాకు గాయపడ్డ గేదె, ఆవుదూడకు అటవీశాఖ అధికారులు వెటర్నరీ డాక్టర్లుతో కుట్లువేయించి చికిత్స చేయించారు.
పగటి పూట కూడా సంచారం
ప్రత్తిపాడు, శంఖవరం మండలాల పరిధిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడగా ఓ మోస్తారు వర్షం కురిసింది. చల్లదనం ఉండడంతో పగటి పూటే పులి బయటకు సంచరించే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లోకి వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే ప్రతీ రోజు ఉదయం అటవీశాఖ అధికారులు ఊళ్లల్లోకి వచ్చి పులి జాడ ఏమైనా తెలిసిందా అని మమ్మల్ని అడుగుతున్నారని, ఇదేం చోద్యం అని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపిస్తే టేపుతో కొలతలు తీసుకుంటున్నారు తప్ప పులిని బంధించే చర్యలు మాత్రం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలాలకెళ్లి పనులు చేసుకునే సమయంలో ఈ పులి వల్ల ఏ పని చేసుకోలేకపోతున్నామని, పులిని పట్టుకునేందుకు ప్రభుత్వం డబ్బులు బాగా ఇస్తుందట మాక్కూడా ఎంతో కొంత ఇస్తే పొలాలకెళ్లడం మానేస్తామని చురకలు అంటిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకోలేకపోతే తామే పట్టుకుంటామని గ్రామస్తులు అధికారులకు ఛాలెంజ్ విసురుతున్నారు.
మహారాష్ట్ర తడోబా బృందాలు ఎక్కడ..?
బెంగాల్ టైగర్ ను బంధించేందుకు మహారాష్ట్ర నుంచి తడోబా బృందాలు వస్తున్నాయని అధికారులు చెపుతున్నారని, మరి ఎక్కడ వచ్చాయని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అసలు వాళ్లు వస్తారా వచ్చి పట్టుకుంటారా లేదా రోజులపాటు కాలక్షేపం చేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే 15 పశువులకు పైగా పెద్దపులి పొట్టన పెట్టుకుందని, ఇంకా ఎన్ని మూగజీవాలు క్రూరమృగానికి బలికావాల్సి వస్తోందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఉదయం కల్లా మహారాష్ట్ర నుంచి తడోబా బృందాలు శరభవరం చేరుకుంటారని చెబుతున్నారు.