Razole News : రాజోలులో వైసీపీకి షాక్, జనసేనలోకి బొంతు రాజేశ్వరరావు
Razole News : రాజోలులో వైసీపీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బొంతు రాజేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు.
Razole News : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి గట్టి షాక్ తగిలింది. రాజోలులో కీలక నేత బొంతు రాజేశ్వరరావు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రెండుసార్లు రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు బొంతు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు పదవికీ బొంతు రాజీనామా చేశారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ కు తన రాజీనామా చేశారు. ఆ లేఖను మీడియాకు బొంతు విడుదల చేశారు. రాజోలు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితి చూడలేకే వైసీపీ రాజీనామా చేశానని బొంతు రాజేశ్వరరావు వెల్లడించారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసీపీలో ప్రాధాన్యం ఇవ్వడంపై బొంతు వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే జనసేన పార్టీలో చేరుతున్నట్లు బొంతు రాజేశ్వరరావు ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ గా పనిచేసిన బొంతు రాజేశ్వరరావు వై.ఎస్.కు సన్నిహితుడిగా ఉన్నారు.
జనసేనలోకి చేరికలు
ఇటీవలి కాలంలో జనసేనలో జరుగుతున్న చేరికలు పెరిగాయి. గుడివాడలో కొడాలి నాని ముఖ్య అనుచరులుగా పేరు పడిన పాలంకి బ్రదర్స్ జనసేనలో చేరారు. వారు కొడాలి నానిపై పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. వారు సొంత రాజకీయం చేస్తున్నారు. తాజాగా రాజోలు నియోజకవర్గం నుంచి గత రెండు సార్లు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు కూడా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన రహస్యంగా పవన్ కల్యాణ్‌ను కలిశారు. అయితే రాజోలులో ఇప్పటికే జనసేన తరపున టిక్కెట్ కోసం మాజీ ఐఏఎస్ ఒకరికి పవన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన నియోజవకర్గంలో పని చేసుకుంటున్నారు. బొంతు రాజశ్వేరరావు రాజోలు కాకపోతే మరో చట అయినా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే జనసేలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామిరెడ్డి అనే వైసీపీ నేత కూడా జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో రోజూ ఇలాంటి చేరికలు ఉన్నాయి. సోమవారం పార్వతీపురం, పెదకూరపాడు నుంచి కొంత మంది నేతలు వచ్చి చేరారు.
వైఎస్ఆర్‌సీపీ నుంచే జనసేనలోకి వలసలు !
జనసేన పార్టీలో చేరుతున్న వారిలో అత్యధికం వైఎస్ఆర్‌సీపీ నేతలే. పాలంకి బ్రదర్స్ సహా శివరామిరెడ్డి, బొంతు రాజేశ్వరరావు వంటి వారు వైఎస్ఆర్‌సీపీలో కీలకంగా పని చేసిన వారే. టిక్కెట్ గ్యారంటీ ఉంటే.. చాలా మంది జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీకి నాయకుల కొరత ఉంది. పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని సొంత బలం తోడు చేసుకుని విజయం సాధించగల అభ్యర్థుల కోసం ఆ పార్టీ ఎదురు చూస్తోంది. వైఎస్ఆర్‌సీపీలో నేతలు ఓవర్ లోడ్ అయ్యారు. చాలా మందికి రాజకీయంగానూ గుర్తింపు లభించడం లేదు. ఏ గుర్తింపు లేని చోట ఉండటం కన్నా.. జనసేన లాంటి పార్టీలో చేరితే కీలకంగా పని చేస్తే మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీ వైపు ఎక్కువ మంది చూస్తున్నారని భావిస్తున్నారు.