
Kodali Nani: వైసీపీ కార్యకర్తలపై దాడులు - మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని స్పందన ఏంటంటే?
Andhra Pradesh News: రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై.. టీడీపీ, కూటమి శ్రేణులు దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodali Nani Responds On Attacks On Ysrcp Supporters: రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన శ్రేణులు దాడులు చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని (Kodali Nani) అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. 'టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు. వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు అనుకుంటున్నారు. గ్రామాల్లో దాడులు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై పోరాడుతాం. దీనిపై హైకోర్టుకు వెళ్తాం. దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపైనా కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తాను. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.' అని కొడాలి నాని పేర్కొన్నారు.
'విధ్వంసం సృష్టిస్తున్నారు'
ఎన్నికల్లో గెలిచిన కూటమి శ్రేణులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ మారణ హోమం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆవేదన వ్యక్తం చేశారు. 'కౌంటింగ్ రోజు నుంచే టీడీపీ, జనసేన శ్రేణులు.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. డీజీపీ, పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా చంద్రబాబు వాళ్ల చేతులు కట్టేశారు. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడే ఇదంతా చేయిస్తున్నారు. పోలీసులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్న వారిని కనీసం ఆపేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోనందుకు పోలీసులపై కోర్టుకు వెళ్తాం.' అని పేర్ని నాని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
