Joinings in Janasena : జనసేన వైపు వైసీపీ లీడర్, క్యాడర్ చూపు - పెద్ద ఎత్తున చేరికలు
Andhra Pradesh : వైఎస్ఆర్‌సీపీ కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వారికి కండువాలు కప్పు ఆహ్వానించారు.
Key leaders of YSRCP joined Janasena party : జనసేన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. గతంలోనే వీరు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.వైసీపీకి భవిష్యత్ లేదని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరే విషయంపై చర్చలు జరిపి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున సభ పెట్టి జనసేనలో చేరాలనుకున్నా.. కూటమి పార్టీల మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణం చెడిపోతోందన్న కారణంగా పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. ఒక్కరే వచ్చి పార్టీలో చేరాలని సందేశం పంపారు. ఈ మేరకు బాలినేని కూడా వెళ్లి పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ కుటుంబంతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్నా.. జగన్ తనను గుర్తించాల్సినప్పుడు గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలంలో ఎలాంటి పనులు చేయించలేకపోవడం వల్ల ఓడిపోయానని ఆయన చెప్పి పార్టీ మారిపోయారు. జగ్గయ్యపేటలో వైసీపీకి మద్దతిచ్చే సామాజికవర్గాలు తక్కువగా ఉండటంతో..ఆయన పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారు. ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనతో చర్చలు పూర్తి కావడంతో జనసేనలో చేరారు. ఆయన మామ , మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఆయన ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారు. అయితే వయసు కారణంగా యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనడం లేదు.
ఆవు కల్తీ అందుకే ఆవు నెయ్యి కూడా కల్తీ - మాజీ స్పీకర్ తమ్మినేని వివరణ
వీరితో పాటు వైసీపీకి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ భారీ తేడాతో ఓడిపోయింది. అనేక చోట్ల కనీస పోటీ ఇవ్వలేకపోవడంతో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. అధికార పార్టీ కూటమిలో భాగంగా ఉండటం కూడా ఎక్కువ మంది నేతలు జనసేన వైపు చూడటానికి మరో కారణం. పార్టీని చేరికలతో బలోపేతం చేయాలని అనుకుంటున్నప్పటికీ... ఎవరిని పడితే వారిని చేర్చుకునేందుకు జనసేన సిద్ధంగా లేదని చెబుతున్నారు. కూటమి పార్టీలతో చర్చించి.. వారికి అభ్యంతరం లేకపోతేనే చేర్చుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
కూటమిలో బాలినేని ఉక్కపోత ఖాయం - వదిలేది లేదంటున్న దామచర్ల - ఇక దారేది ?
ఇంకా పలువురు వైసీపీ నేతలు జనసేన నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఓకే అంటే వచ్చి చేరిపోతామని కబురు చేస్తున్నారు. అయితే కేసుల నుంచి తప్పించుకోవడానికో.. అధికార పార్టీ అని దందాలు చేయడానికో వచ్చే వారిని ఎంటర్‌టెయిన్ చేయకూడదని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. అందుకే చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.