Gali Janardhan Reddy : నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతా, గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Gali Janardhan Reddy : నేను తలచుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతా అని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఆయన సోదరుడి జన్మదిన వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
Gali Janardhan Reddy : నేను అనుకుంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అవుతా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బళ్లారిలో తన తమ్ముడు గాలి సోమశేఖర్ రెడ్డి 57వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులపై ఎలాంటి ఆశా లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. తన సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మంగళవారం బళ్లారిలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి ఫంక్షన్ కు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు.
మనీపై ఆశ లేదు
రెడ్డి సోదరులకు, అలాగే శ్రీరాములుకు మనీపై ఆశ లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కావాలని లేదని తెలిపారు. మంత్రి కావాలని కూడా లేదని చెప్పారు. అలాంటి ఆశలు ఉంటే తాను ఒక్క రోజు అయినా సీఎం అవుతానని అన్నారు. తనను ఇబ్బందులు పెట్టాలని కొందరు అనుకున్నారన్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే తనతో చెప్పారని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. అయితే తాను ఒక్క రోజు అయినా సీఎం అవుతానని చెప్పిన కొన్ని క్షణాలలోనే అక్కడున్న ప్రజలు, అనుచరులు ఆయనపై పూల వర్షం కురిపించారు.
మైనింగ్ కింగ్
గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకలో బీజేపీకి చెందిన నేత. కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఆయన ఒకరు. బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2006లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన ఆయన...బీఎస్ యడ్యూరప్ప మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. బళ్లారి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించారు. గాలి జనార్దన్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ సుపరిచితమే. గాలి జనార్దన్ రెడ్డిని మైనింగ్ కింగ్ అని పిలుస్తుంటారు.
ఓబులాపురం మైనింగ్ ఆరోపణలు
ఓబులాపురం మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని 2009లో కేసులు నమోదు అయ్యారు. ఈ మైనింగ్ కుంభకోణం ఏపీ, కర్ణాటకలో రాజకీయ దుమారం రేపాయి. గనుల్లో అక్రమ తవ్వకాల వల్ల వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గనులకు సంబంధించి ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని పలువురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసులను 2017లో సీబీఐ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. మొత్తం 72 కేసులు నమోదు అవ్వగా కోర్టు ఎక్కువ శాతం కేసులను కొట్టేసింది. మరికొన్ని కేసుల్లో అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఈ మైనింగ్ కేసులో ప్రధాన సాక్షులను భయపెట్టారనే ఆరోపణలు కూడా లేకపోలేదు.