Kapu JAC Meeting: సీఎం జగన్ రూ.10 వేలకోట్లు విడుదల చేయాలని డిమాండ్, కాపు జేఏసీ సమావేశంలో 8 తీర్మానాలివే
Kapu Leaders Meeting In Vijayawada: ఏపీలో లో కాపుల జనాభాను లెక్కించి దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో అన్ని పదవులు, హోదాల్లో తమకు ప్రాధాన్యతనివ్వాలని తీర్మానం చేశారు.
Vijayawada Kapu JAC Meeting: విజయవాడ: ఏపీ రాజీకీయాల్లో కాపు ఓటర్ల ప్రభావం అధికంగానే ఉంటుంది. అందుకే కాపుల ఓట్ల కోసం (Kapu Vote Politics) రాజకీయాలు అక్కడ కొత్తేమీ కాదు. అయితే తాము ఏ పార్టీకి అనుకులం కాదని, వ్యతిరేకం కాదని కాపు జేఏసీ (Kapu JAC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర కాపు, తెలగ బలిజ ఒంటరి కులాల జేఏసీ అధ్వర్యంలో విజయవాడ బందరురోడ్డులోని అమరావతి ఫంక్షన్ హాల్ లో బుధవారం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చందు జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాలుగు వందల మంది వరకు కాపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాపుల జనాభాను లెక్కించి దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో అన్ని పదవులు, హోదాల్లో తమకు ప్రాధాన్యతనివ్వాలని తీర్మానం చేశారు.
కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ మాట్లాడుతూ.. కాపు జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు, అలాగని వ్యతిరేకంగా పనిచేయదని స్పష్టం చేశారు. కాపు నేత, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆయనను జేఏసీ, కాపు కులం కాపాడుకుంటుంది అన్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా తమ కాపు కుటుంబ సభ్యులను కాపాడుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి సమస్యల పరిష్కారం కోసం కీలక పాత్ర పోషిస్తాం అన్నారు.
కాపు జేఏసీ 8 తీర్మానాలు ఇవే..
కాపు ఉప కుల సంఘాల నేతల పాల్గొన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చల తరువాత ఎనిమిది అంశాలపై తీర్మానం చేసినట్లు చందు జనార్ధన్ తెలిపారు. ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రెండు వేల కోట్లు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కనుక ఈ 5 ఏళ్లకు గానూ మొత్తం రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులను ప్రత్యేకంగా కాపు సంక్షేమానికి ఖర్చు చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఈ EWS కోటాలో అయిదు శాతాన్ని వెంటనే అమలు చేయాలి.
అన్ని రాజకీయ పార్టీలు వార్డు మెంబెర్ స్థాయి నుంచి పార్లమెంట్ మెంబర్ స్థాయి వరకు దామాషా పద్ధతిలో ప్రాధాన్యతనివ్వాలని తీర్మానం చేశారు. కులాల వారీగా కులగణన చేపట్టి రాష్ట్రము లో ఉన్న కాపు సామాజికవర్గ సంఖ్యను లెక్కించి ఆ దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయాలలో అవకాశం కల్పించాలి.
నూతన జిల్లాలలో కొన్ని జిల్లాలకు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన రంగా, పెరియార్ రామస్వామి, కన్నెగంటి హనుమంతుల పేర్లు పెట్టాలి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కాపు భవనాన్ని నిర్మించడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని తీర్మానం చేసినట్లు చందు జనార్ధన్ వివరించారు.
త్వరలోనే ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కడప లేదా కర్నూల్ ప్రాంతీయ జేఏసీ సమావేశాలు నిర్వహిస్తామని చందు జనార్ధన్ ప్రకటించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, తోట రాజీవ్, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, వాసిరెడ్డి ఏసు దాస్, నల్లా విష్ణు, అరేటి ప్రకాష్, మంచాల సాయి సుధాకర్ నాయుడు, అమంచి సోములు, ముత్యాల రామదాసు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.