Kakinada Tiger Roaming : అటవీ అధికారులకు షాకిచ్చిన పెద్ద పులి, మరో మండలంలో మకాం
Kakinada Tiger Roaming : కాకినాడ జిల్లాలో మరో మండలానికి పెద్ద పులి మకాం మార్చింది. రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయిందని భావించిన అధికారులకు షాక్ ఇస్తూ రౌతులపూడి మండలంలో ఆవులపై దాడి చేసింది.
Kakinada Tiger Roaming : కాకినాడ జిల్లా వాసులకు పెద్ద పులి కంటి మీద కునుకు పడనివ్వడంలేదు. నెల రోజులుగా ముప్పతిప్పులు పెట్టిన పులి తాజాగా రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయిందని అధికారులు చెప్పిన గంటల వ్యవధిలోనే షాక్ ఇచ్చింది. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రౌతులపూడి మండలం ఎస్. పైడిపాలెంలోని పొలంలో మేత మేస్తున్న ఆవులపై దాడి చేసింది టక్కరి టైగర్. అయితే చాకచక్యంగా తప్పించుకున్న ఆవులు పరుగులు పెట్టాయి. కానీ ఒక ఆవు మాత్రం పులి పంజా దెబ్బకు గాయాల పాలయ్యింది. దీంతో కొత్తగా రౌతులపుడి మండలానికి పులి భయం మొదలయ్యింది. ఎస్.పైడిపాలెం, సమీప గ్రామాల రైతులు పులి భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సరిహద్దులు దాటుకుంటూ
నెల రోజులుగా కాకినాడ జిల్లా పరిధిలోని ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల ప్రజలను భయాందోళనలో నెట్టిన పెద్ద పులి తాజాగా రౌతులపూడి మండలంలోకి ఎంటర్ అయ్యింది. రెండు రోజుల క్రితం ప్రత్తిపాడు, శంఖవరం మండల సరిహద్దు ప్రాంతాల్లోని తాడువాయి, పెద్ద మల్లాపురం గ్రామాల శివారు ప్రాంతాల ద్వారా రిజర్వు ఫారెస్ట్ లోకి వెళ్లిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిజర్వు ఫారెస్ట్ లోనుంచి తిరిగి జనావాసాలకు దిశ మార్చుకున్న పెద్దపులి అనూహ్యంగా రౌతులపుడి మండలంలోని ఎస్. పైడిపాలెం ప్రాంతంలో అలజడి రేపింది. పగటిపూట రిజర్వు ఫారెస్ట్ లోను రాత్రి అయితే దానికి అనుకూలంగా ఉన్న జనావాసాల మీదకు పెద్దపులి దిశ మార్చుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
వర్షంతో పులి ఆనవాళ్లకు ఆటంకం
గత రెండు రోజుల నుంచి వర్షం పడడంతో పులి పాదముద్రలు గుర్తించడం అటవీ శాఖ అధికారులకు కష్టతరంగా మారింది. రోజుకో కొత్త ప్లేసులో మకాం మార్చుకున్న పెద్దపులి జాడ తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి శంఖవరం, రౌతులపుడి, ప్రత్తిపాడు మండలాల పరిధిలో ఎస్. పైడిపాలెం, తాడువాయి, శృంగదార, సిద్ది వారిపాలెం, ఆంధ్ర శబరిమలై, బవురువాక ,వేలంగి పరిసర ప్రాంతాల్లో పులి ఆనవాళ్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఎక్కడా కూడా పులికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
Also Read : Kakinada Tiger : కోనసీమలో పత్తాలేకుండా పోయిన పెద్దపులి, రంగంలోకి తడోబా బృందాలు