JC Prabhakar Reddy : కొంత మంది వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి - జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు !
కొందరి వల్ల న్యాయవ్యవస్థపై నమ్మకం పోతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.
JC Prabhakar Reddy : జ్యుడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి ఉందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల జ్యుడిషియరీలో కొంతమందికి బాధ కలగొచ్చునన్నారు. తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు... ఈకేసులో బెయిల్ కాదు.. క్వాష్ పిటిషన్‍పైనే పోరాటం చేయాలని సూచించారు. చంద్రబాబు కోసం ఇప్పుడు చేస్తున్న దీక్షల కంటే ఇంకా ఉత్తమంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరి కొద్ది రోజుల ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో నెలకొన్న ఆందోళన ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. ఆ రోజు ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. ఇలాంటి అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటామని.. చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అయిపోతారని హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి కొట్టి వేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబ్బంది కొరత ఉందన్న పోలీసులు.. చంద్రబాబుని వందల మంది చుట్టుముట్టి అరెస్టుకు అంతమంది ఎక్కడి నుంచి వచ్చారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లా యాడికిలో టీడీపీ, సీపీఐ, జనసేన పార్టీల శ్రేణులు నిరాహార దీక్షలు నిర్వహించాయి. ఈ దీక్షలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులు, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులకు కూడా ఇదే గతి పడుతుందని ఆగ్రం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గమైన అధికార వ్యవస్థ ఎప్పుడూ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పదహారు నెలలు జైల్లో ఉండి 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి, చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం ఆశ్చర్యం లేదన్నారు. వేల కోట్ల స్కాంలు చేసిన జగన్, చంద్రబాబుని జైలులో పెట్టించినంత మాత్రాన ఏమీ కాదని అన్నారు. యువత భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించే చంద్రబాబుని అక్రమ అరెస్టుతో జైలులో పెట్టారని.. ఇప్పుడైనా ప్రజలు రోడ్లమీదకు రాకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని జేసీ హెచ్చరించారు.
అనంతపురంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకూ నిరసనలు కొనసాగిస్తామని తెలుగుదేశం నేతలు హెచ్చరించారు. జగన్ మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేడే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని టీడీపీ నేతలు విమర్శించారు. నందమూరి బాలకృష్ణను రెచ్చగొట్టే విధంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారని సీపీఐ నేతలు ఆరోపించారు. రెచ్చకొట్టి, అక్రమ కేసులు పెడితే ఎవరూ భయపడేది లేదంటూ హెచ్చరించారు.