Pawan Kalyan: 23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ - సీఎం సీటు కంటే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవి కంటే తనకు ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.
Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవి కంటే తనకు ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవుల్లో నూతనంగా నియమించిన వారికి పవన్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి నేను పూర్తి సుముఖంగా ఉన్నానని అన్నారు. వైసీపీని గద్దె దించే రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం వస్తే దాన్ని కచ్చితంగా స్వీకరిస్తానని, అయితే దాని కంటే ముందు తనకు రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... ‘2024లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దూరం చేసి జనసేన- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రతి కార్యకర్త బలంగా పనిచేయాలి. ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి నేను సుముఖంగానే ఉంటాను. అంతకంటే ముందు రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాను. దశాబ్దకాలంగా జనసేన రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి నడిచిన, పార్టీ అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు
‘ప్రతికూల పరిస్థితుల్లోనే ఓ మనిషి అసలు స్వరూపం బయటపడుతుందని చెబుతారు. పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో నా వెంట నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలోకి రాగానే అధికారం, పదవులు వస్తాయని చాలా మంది భావించారు. వారంతా తర్వాత కాలంలో వెళ్లిపోయారు. అయితే ఎలాంటి పదవులు లేకున్నా, అధికారంలోనూ లేకపోయినా నాతో పాటు కలిసి నడిచి, పార్టీ కోసం పనిచేసిన వారు ఎందరో ఉన్నారు. వారి సేవలు, వారిని నిత్యం గుర్తుపెట్టుకుంటాను. 2024లో సమష్టిగా రాష్ట్ర బాగు కోసం, వైసీపీని తరిమికొట్టడం కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. ‘చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అధిగమించి పని చేద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నామనేది అంతా గుర్తు పెట్టుకోవాలి’ అని అన్నారు.
‘జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీలక కార్యకర్తలే. పార్టీ నిర్ణయాలను అందరితో చర్చించిన తర్వాతే నేను నిర్ణయం తీసుకుంటాను. కేవలం 150 మంది సభ్యులతో మొదలైన జనసేన ప్రస్థానం నేడు 6.50 లక్షల క్రియాశీలక సభ్యులకు చేరింది. ప్రతిరోజూ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ పార్టీకి వెన్నెముకగా పనిచేస్తున్నారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం పార్టీ విజయం రాష్ట్రానికి కచ్చితంగా ఓ దిశానిర్దేశం చూపేలా ఉండబోతోంది. పార్టీకి సంబంధించిన 12 కమిటీల్లో రాష్ట్ర కార్యవర్గం 200 పైచిలుకు సభ్యులు అయ్యారు. నూతనంగా రాష్ట్ర కార్యవర్గంలో చేరిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలి’ అని పార్టీ శ్రేణులను కోరారు.
‘ఆంగ్ల మాధ్యమంపై మాట్లాడితే ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం అంటారు. కాలేజీ స్థాయిలో ఇవ్వాల్సిన టోఫెల్ శిక్షణ 3వ తరగతి వారికి ఎందుకు? కేవలం ఇంగ్లీష్ మాట్లాడటం కోసమే అయితే..ఇంటర్నెట్‌లో చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి. బ్రిటిష్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పని ఎవరు చెప్పారు? భారత రత్న అబ్దుల్ కలాం గారి ఇంగ్లీష్ మన యాసలోనే ఉంటుంది. మంత్రి బొత్స ఏం ఇంగ్లీష్ మాట్లాడతారని మంత్రి అయ్యారు’ అని ప్రశ్నించారు.
ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే అద్భుతాలు జరిగితే అమెరికాలో పేదలే ఉండకూడదు. బ్రిటన్, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎవరూ రోడ్ల వెంట తిరిగేవారు కాదు. ఐబీ సిలబస్ పెట్టడం వెనుక వేరే కుంభకోణం ఉంది. ఒప్పందం జరిగిన తర్వాత ఏదైనా తేడా వస్తే మనం స్విట్జర్లాండ్‌లో కోర్టుకు వెళ్లి దావా వేయాలి. వీటిపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి. దేశంలో ఐబీ సిలబస్ స్కూళ్లు 1200 మాత్రమే ఉన్నాయి. ఐబీ సిలబస్ వెనక తప్పకుండా స్కాం ఉంది. జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తాం’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ
టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలిభేటీ ఈనెల 23న జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నారా లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి పోరాటం, పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే ఇరు పార్టీలు సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులను ప్రకటించాయి.