Pawan Kalyan Speech: అనకాపల్లి అంటే బెల్లం గుర్తొచ్చేది, ఇప్పుడు కోడిగుడ్డు అంటున్నారు: పవన్ కళ్యాణ్ సెటైర్లు
Andhra Pradesh Elections 2024: గతంలో అనకాపల్లి అంటే బెల్లం గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు అనకాపల్లి పేరు చెబితే కోడిగుడ్డు అని వినిపిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
Pawan Kalyan Public Meeting At Anakapalle - అనకాపల్లి: ‘వైఎస్ జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి.. ఇసుక దోపిడీదారు. అనకాపల్లి పేరు చెబితే గతంలో బెల్లం గుర్తొచ్చేది. ఇప్పుడు అనకాపల్లి అంటే కోడిగుడ్డు పేరు వినిపిస్తోంది’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. అనకాపల్లిలో ఆదివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్‌పై, మంత్రి గుడివాడ అమర్నాథ్ పై పంచ్‌లు వేశారు. ఆర్ ఈ సి ఎస్ ఉద్యోగాలు పేరిట మంత్రి అమర్నాథ్ ఐదు లక్షలు లంచం తీసుకున్నాడని పవన్ ఆరోపించారు. అనకాపల్లి (Anakapalli) జిల్లాకు ఓ డిప్యూటీ సీఎం పోస్ట్, 5 పోర్టుఫోలియోలకు మంత్రితో పాటు ఓ విప్ కూడా ఇచ్చింది.. కానీ ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయారని పవన్ విమర్శించారు.
పదవులు కోరుకుంటే ఎప్పుడో వచ్చేవి
‘రాష్ట్ర వ్యాప్తంగా మార్పు తేవడానికి ఈ యాత్ర చేస్తున్నాం. మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేది. నాకు కావలసింది మీ భవిష్యత్. వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరు చెప్పి ఏడాదికి 15 వేలు ఇస్తామన్నారు. ఏడాదికి వెయ్యి చొప్పున తగ్గిస్తూ వచ్చారు. మద్యపాన నిషేధమని చెప్పి.. నాటు సారా కాస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కాదు ఒక వ్యాపారి. రాష్ట్ర అభివృద్ధి కోసం అనకాపల్లిలో సెజ్ లో ఉపాధి అవకాశాలు కల్పించాలి. గతంలో అనకాపల్లి బెల్లం తిరుపతి వెళ్లేది. ఇప్పుడు ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడి బెల్లం తిరుపతి వెళ్లేలా చేస్తాను. తిరుపతి లడ్డూలో అనకాపల్లి బెల్లం వాడే రోజులు వస్తాయి - పవన్ కళ్యాణ్
‘సీపీఎస్ రద్దు విషయంలో పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. సీపీఎస్ పెన్షన్ సమస్య ఏడాదిలోపే పరిష్కరిస్తామని అనకాపల్లి నూకాలమ్మ సాక్షిగా మాట ఇస్తున్నాను. అనకాపల్లి ఆసుపత్రి డెవలప్ చేస్తాం. అనకాపల్లి డంపింగ్ యార్డ్ సమస్య తీరుస్తాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కి ఈ వైసీపీ ఏమి చెయ్యలేదు. కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. గంజాయిని కంట్రోల్ చేస్తాం. స్థానిక పోలీసు సహకారం లేకుండా వైజాగ్ పోర్ట్ లో మాదక ద్రవ్యాలు వస్తాయా? జనం అభిమానంతో జ్వరం పోయింది. కూటమి ప్రభుత్వం రాగానే చెత్త పన్ను తొలగిస్తాం. నూకాలమ్మ రహదారి విస్తారిస్తాం.
శారద నది వద్ద పర్యాటక అభివృద్ధి
సహకార విద్యుత్ సంస్థలను డి మెర్జ్ చేయడంతో పాటు బౌద్ధ క్షేత్రాలు ఉన్న ఇక్కడ హీనయానం, మహాయానం సర్క్యూట్ డెవలప్ చేస్తామన్నారు. శారద నది వద్ద పర్యాటకం అభివృద్ధి చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకోవాలి. ఒంటరిగా ఏమీ చేయలేను మీరందరూ కలిసి వస్తేనే చేయగలనని చెప్పారు. ప్రజలు బాగుండాలంటే మంచి నాయకత్వం అవసరం ఉంది. ఇవి దృష్టిలో పెట్టుకుని కూటమి గెలుపునకు ప్రజలు సహకరించాలని పవన్ కళ్యాణ్ ప్రజల్ని కోరారు.
పొత్తులో భాగంగా జనసేనకు 50 సీట్లు పైగా తీసుకునే సత్తా ఉంది, కానీ 21 స్థానాలు మాత్రమే తీసుకున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే వారికి టికెట్లు ఇచ్చామని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి కొణతాల రామకృష్ణ నెగ్గాలని భావిస్తున్నాను. ఆయన మంచి నేత, అసెంబ్లీలో తనతోపాటు కొణతాల స్వరం కూడా వినిపించాలని అనకాపల్లి ప్రజల్ని పవన్ కళ్యాణ్ కోరారు. ఎన్నికల్లో విజయం సాధించాక విజయనాథంతో అనకాపల్లికి వస్తానన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, అనకాపల్లి నియోజక వర్గానికి చెందిన ప్రముఖులు కంబాల అమ్మోరయ్య, సకలా గోవిందరావు, కొందుల వేణుగోపాల్ లు ఆదివారం సాయంత్రం జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.