Pawan Kalyan: జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు? యువతకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి : పవన్ కల్యాణ్
వైసీపీ ప్రభుత్వానికి నిరుద్యోగుల సమస్యలు పట్టవా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఏంటో యువతకు చెప్పాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వం ఏ కార్యాచరణ చేపట్టిందో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక కొత్త సంవత్సరం గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్(Job Calender) ఇచ్చేస్తానని, ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తానంటూ చెప్పిన సీఎం జగన్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ, పోలీసు ఉద్యోగాల భర్తీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు(Job Notifications) ఇవ్వడంలేదన్నారు. అధికారంలోనికి వచ్చి రెండేళ్లు దాటుతున్నా 10 వేల ఉద్యోగాలతో మాత్రమే క్యాలెండర్ వేశారని అవి ఇప్పటికీ భర్తీ కాలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారన్నారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/F18hZggNYp
— JanaSena Party (@JanaSenaParty) February 11, 2022
ఆందోళనలో యువత
అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారని కలెక్టరేట్ల దగ్గర యువత నిరసన తెలిపితే లాఠీ ఛార్జీలు చేయించి అరెస్టులు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వాళ్లకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం దగ్గర ఉందా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం సీఎం ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారని నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై యువతకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్పీ(Mega DSC) ప్రకటన ఎప్పుడో చెప్పాలన్నారు. పోలీసు ఉద్యోగాల(Police Jobs) భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియచేయాలన్నారు. బీఈడీ చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వాళ్లు, వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారని పవన్ అన్నారు. యువత ఆందోళన ప్రభుత్వానికి అర్థమవుతోందా, అర్థం కానట్లు ఉందా అనే సందేహం కలుగుతోందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్లకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని పాలకులు గుర్తించాలన్నారు.
సినీ ప్రముఖులపై ఉన్న శ్రద్ధ అమరావతి రైతులపై ఎందుకు లేదు : నాదెండ్ల మనోహర్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సముచితమైన పాలన అందిస్తారనుకుంటే దానికి భిన్నంగా విచిత్రమైన వైఖరి అవలంబిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలోని సమస్యలపై కపటవైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంలో అనేక మంది సలహాదారులున్నా పరిష్కారం మాత్రం శూన్యమని ఆరోపించారు. సర్వశాఖల సలహాదారుడికి ఉద్యోగుల, రైతుల సమస్యలు అర్థం కావటంలేదన్నారు. రైతులు యూరియా కోసం సతమతమవుతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. సినీ ప్రముఖులకిచ్చిన సమయం వారిపై చూపిన శ్రద్ధ సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులకు ఎందుకు ఇవ్వడంలేదన్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలను తప్పితే ఎగ్జిబిటర్లను డిస్ట్రిబ్యూటర్లను చర్చలకు ఆహ్వానించకుండా వివక్ష చూపారన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం, నిరుద్యోగ, ఇసుక సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించటం లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిలో వందల కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. రాష్టానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో పోరాడటంలేదన్నారు. మూడు సంవత్సరాలు అవుతున్నా కీలక అంశాలపై ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) అని విమర్శించారు.