Adviser Ali : సినీ నటుడు అలీకి గుడ్ న్యూస్ - కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్ !
సినీ నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని జగన్ ఇచ్చారు. రెండేళ్ల పాటు ఈ పదవి ఉంటుంది.

Adviser Ali : వైఎస్ఆర్‌సీపీ నేత, సినీ నటుడు అలీకి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. అలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలీకి చెల్లించే జీతభత్యాల గురించి విడిగా ఉత్తర్వులు ఇస్తామని జీవోలో చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడంతో.. ఆయన టీవీ చానళ్లలో ప్రభుత్వ అనుకూల ప్రచారాన్ని సమన్వయం చేసుకునే అవకాశం ఉంది. పలువురు సలహాదారులకు కేబినెట్ ర్యాంక్ ప్రకటించారు కానీ.. అలీకి అలాంటి ర్యాంక్ ఇస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో ఎక్కడా ప్రకటించలేదు.
అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్‌సీపీలో చేరిన సినీ నటుడు అలీ
2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేనలతో పాటు వైఎస్ఆర్‌సీపీని కూడా సంప్రదించారు. చివరికి ఆప్తమిత్రుడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీని కూడా కాదని ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. కానీ అసెంబ్లీ టిక్కెట్‌ను కేటాయించలేకపోయారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు కీలక పదవి ఇస్తారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఓ సందర్భంలో రాజ్యసభ సీటుకు పరిశీలనకు అలీ పేరు తీసుకున్నారు. సీఎం జగన్ కూడా ఆయనను పిలిపించి మాట్లాడారు. వారంలో గుడ్ న్యూస్ చెుబతామన్నారని సీఎం క్యాంప్ ఆఫీసులో మీడియాతో చెప్పారు. అయితే కాస్త ఆలస్యంగా ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు.
రాజ్యసభ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవులు వస్తాయని ప్రచారం.. చివరికి సలహాదారు పదవి
ఈ మధ్యలో నటుడు అలీకి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారని కూడా చెప్పుకున్నారు. కానీ ఆ పదవికీ ఆయనను పరిశీలనలోకి తీసుకోలేదు. ఇటీవల అలీ జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని అలీ ఖండించారు. తాను పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని జగన్ ను సీఎం చేయడానికే చేరానని.. మరోసారి జగన్ ను సీఎం చేయడానికి కృషి చేస్తానని అలీ ప్రకటించారు. నిజానికి అలీ జనసేనలో చేరుతారని పెద్దగా ప్రచారం జరగలేదు. అలా ప్రచారం చేయడం వల్ల పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న అభిప్రాయం ఉంది. ఇదే నిజమయింది. హైకమాండ్ గుర్తించింది. సలహాదారు పదవి ఇచ్చింది.
వచ్చే ఎన్నికల్లోనూ అలీకి టిక్కెట్ లేనట్లేనా ?
అయితే అలీకి ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యం ఉంది. కానీ ఈ సారి కూడా వైఎస్ఆర్‌సీపీ తరపున వచ్చే ఎన్నికల్లో గుంటూరు లేదా రాజమండ్రి సీట్లు కూడా ఇచ్చే అవకాశం లేదని అందుకే ఇప్పుడు సలహాదారు పదవి ఇచ్చారన్న ప్రచారం వైఎస్ఆర్‌సీపీలో జరుగుతోంది. సలహాదారు పదవి విషయంలో అలీ అంగీకారం తర్వాతనే జీవో జారీ చేశారని..ఆయన తిరస్కరించే అవకాశం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
మొయినాబాద్ ఫాం హౌస్ లో మరోసారి పోలీసుల తనిఖీలు, రహస్య ప్రాంతాల్లో విచారణ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

