IT Notice To Varla Ramaiah : టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు - వైఎస్ఆర్‌సీపీకి ఇక టెన్షనేనా ?
గుడివాడ కేసినో కేసులో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై ఐటీ అధికారులు స్పందించారు. మరిన్ని వివరాలు ఇవ్వాలని వర్ల రామయ్యకు నోటీసులు జారీ చేశారు.
IT Notice To Varla Ramaiah : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఆదాయపు పన్నుశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులు ఆయన ఆదాయ, వ్యయాలు, ఆస్తులకు సంబంధించినవి కావు., గతంలో ఆయన ఫిర్యాదు చేసిన గుడివాడ కేసినో కేసునకు సంబంధించినవి. గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. గతంలో చేసిన ఫిర్యాదులపై అదనపు సమాచారం ఇవ్వాలని వర్ల రామయ్యకు IT నోటీసులు పంపింది. దీంతో ఆయన 19వ తేదీన ఐటీ అధికారులను కలవనున్నారు.
జనవరిలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కేసినో
గుడివాడలో సంక్రాంతి వేడుకల సందర్భంగా కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో తో పాటు పేకాట లాంటి జూదాలతో పాటు చీర్ గర్ల్స్ తో అసభ్య నృత్యాలు నిర్వహించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన పలు వీడియోలను,. ఫోటోలను అప్పట్లో తెలుగుదేశం నేతలు మీడియాకు విడుదల చేశారు. నిజనిజాలను నిగ్గుతేల్చేందుకు ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు తన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ నియమించారు.
ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు
ఆ తర్వాత వర్ల రామయ్య తాము సేకరించిన ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. మంత్రి కోడాలి నాని ఆధ్వర్యంలోనే ఈ క్యాసినో జరిగిందని అని అన్నారు. ఈ అంశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, రెవిన్యూ ఇంటెలిజెన్స్, ఐటీ విభాగాలు రంగంలో దిగి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. జాతీయ స్థాయిలో పోరాడుతామని చెప్పారు. మూడు రోజుల్లో క్యాసినో ద్వారా రూ. 250 నుంచి 500 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు. మొత్తం 13 మంది చీర్ గర్ల్స్ ఇండిగో విమానంలో ప్రయాణం చేశారని వెల్లడించారు.గన్నవరం – బెంగళూరు. బెంగళూరు – గోవా, గోవా – విజయవాడ ప్రయాణీకుల వివరాలను మీడియా ముందు ఉంచారు. వీటిని దర్యాప్తు సంస్థలకు కూడా ఇచ్చారు. క్యాసినో పాల్గొనే వారి నుండి రూ.50వేల వరకూ వసూలు చేశారనీ, ఆ ప్యాకేజీలో భాగంగా లాడ్జి వసతి, ట్రాన్స్ పోర్టు, ఎంట్రీ ఫీజు అన్ని ఉచితమని వర్ల రామయ్య సాక్ష్యాలు చూపించారు.
దర్యాప్తు అధికారిని నియమించినా పట్టించుకోలేదు !
గుడివాడ కేసినో అంశం తీవ్ర దుమారం రేగడంతో గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు . క్యాసినో వ్యవహారంపై విచారణకు ఆదేశించారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఇందుకోసం ప్రత్యేక విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును నియమించారు. సంక్రాంతి 4 రోజులు ఏం జరిగింది అనే దానిపై ఇప్పటికే గుడివాడ డీఎస్పీతో మాట్లాడిన ఎస్పీ.. ఇప్పుడు విచారణ బాధ్యతలు నూజివీడు డీఎస్పీకి అప్పగించారు.గోవా నుంచి క్యాసీనో టీమ్‌ను రప్పించింది ఎవరనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు తాజాగా దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.కానీ ఆ తర్వాత విచారణ ముందుకు సాగలేదు.
కేసినో నిర్వహించింది చీకోటి ప్రవీణే !
ఇన్ని రోజులకు టీడీపీ నేతల ఫిర్యాదుపై ఐటీ స్పందించడం ఆసక్తికరంగా మారింది. గుడివాడలో కేసినో నిర్వహించింది.. ఇటీవల తెలంగాణలో ఈడీ దాడులకు గురైన.. కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్. అందుకే.. ఈ కేసులో తాజాగా.. కొత్త పరిణామాలు చోటు చేసుకుంటూడటం ఆసక్తికరంగా మారింది.