Where Is Kalki Bhagawan : కల్కి భగవాన్ అవతారం చాలించారా..? అసలాయన ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..?
కల్కి భగవాన్ బయట కనిపించక చాలా కాలం అయింది. ఒకప్పుడు వీఐపీలతో కళకళలాడిన ఆశ్రమం ఇప్పుడు వెలవెలబోతోంది. ఇంతకీ కల్కి ఎక్కడుతున్నారు ? అవతారం చాలించారా?
కల్కి భగవాన్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ పేరు చాలామందికి తెలుసు. సామాన్య భక్తులే కాదు, వీఐపీలు కూడా ఆయన సేవలో తరించారు. ఆయన ఆశ్రమానికి క్యూ కట్టారు. కల్కి భగవాన్, అమ్మ భగవాన్ బోధనలు అప్పట్లో చాలామందిని కట్టిపడేశాయి. లక్షల్లో వారికి భక్తులున్నారు. నిత్యం వేలాదిమంది ఆశ్రమానకి తరలి వచ్చేవారు. అంగరంగ వైభవంగా పూజలు, పునస్కారాలు, కల్కి ఆశ్రమంలో సాంస్కృతి కార్యక్రమాలు భజనలు, సేవా కార్యక్రమాలు. కానీ ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ ఆశ్రమం ఎలా ఉందంటే... కల్కి భగవన్ అవతారం చాలించి వెళ్లిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది.
నిర్మానుష్యంగా వరదయ్యపాలెం కల్కి ఆశ్రమం !
ప్రస్తుతం వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. కేవలం అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రమే ఉన్నారు. భక్తులెవరూ రావడం లేదు. 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ ఆశ్రమం మెయింటెనెన్స్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పచ్చదనం ఎక్కడా తగ్గకుండా చూస్తున్నారు. ఒకప్పుడు పార్కింగ్ కి స్థలం సరిపోయేది కాదు కానీ ఇప్పుడు అక్కడ పార్కింగ్ చేయడానికి వాహనాలు లేవు. వేలాదిమంది భోజనం చేసే భోజన శాల.. ఖాళీగా ఉంది. ఒకేసారి మూడు అంతస్తుల్లో ప్రార్థనలు జరిగే వన్ నెస్ ప్రార్థనా మందిరం ఇప్పుడిలా పూర్తిగా బోసిపోయింది. ఇదీ ప్రస్తుతం కల్కి భగవాన్ ఆశ్రమంలో ఉన్న పరిస్థితి.
2019 ఐటీ దాడుల తర్వాత బయట కనిపించని కల్కి భగవాన్ !
2019లో కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు జరిగాయి. అక్రమ నగదు సీజ్ చేశారని ప్రచారం జరిగింది. హవాలా ద్వారా సొమ్ము తరలిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కల్కి దంపతులు ఆశ్రమం వదిలి పారిపోయారని కూడా అన్నారు. కానీ సడన్ గా కల్కి దంపతులు ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. తామెక్కడికీ పారిపోలేదని చెప్పారు. అయితే కల్కి ఆశ్రమంలో ఐటీ అధికారులు లెక్కలకు దొరకని 500 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 18కోట్ల రూపాయల విలువైన అమెరికా డాలర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వరదయ్యపాలెంలోని కల్కి కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. అయితే ఈ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కల్కి పేరిట ఉన్న భూములు, ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. వరదయ్యపాలెంలో వన్ నెస్ పేరుతో ఉన్న ఆశ్రమం మాత్రం కల్కి అధీనంలోనే ఉంది.
ఇప్పటికీ ఆజ్ఞాతంలో కల్కి భగవాన్, అమ్మా భగవాన్
కల్కి భగవాన్ ఎదుగుదలతో ఆయన కొడుకు కృష్ణాజీ పాత్ర కూడా చాలా ఉంది. వన్ నెస్ ఆశ్రమం స్థాపించడం, అక్కడికి వీఐపీలను తేవడం, విదేశీ భక్తులను సమన్వయ పరచడం, వారికి కల్కి ఆశ్రమంలో వివిధ రకాల దీక్షలు ఇప్పించడం ఇవన్నీ కృష్ణాజీ చూసుకునేవారు. కల్కి కోడలు ప్రీత కృష్ణ కూడా ఈ ఆశ్రమం వ్యవహారాలు చూసేవారు. ఐటీ సోదాల తర్వాత కల్కి దంపతులు కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నైలో ఉంటూ ఆశ్రమానికి వచ్చే భక్తులకు వీడియో కాల్ రూపంలో దర్శనమిచ్చేవారు. బోధనలు చేసేవారు. ప్రస్తుతం అది కూడా లేనట్లుగా తెలుస్ోతంది. ప్రస్తుతం వారాంతాల్లో మాత్రమే ఆశ్రమానికి భక్తులు వస్తున్నారు. ఇప్పుడు అది కూడా బాగా తగ్గిపోయింది.
ఒకప్పుడు వీఐపీల దర్శన కేంద్రం !
ఇప్పుడు తిరుపతి జిల్లాలో వన్ నెస్ అనే పేరుతో వరదయ్యపాలెంలో ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. పాలరాతితో మెరిసిపోయే ఈ ఆశ్రమాన్ని. 2006లో నిర్మించారు. అప్పటినుంచి 2019 వరకు ఈ ఆశ్రమం ఓ వెలుగు వెలిగింది. సినీ తారలు, రాజకీయ నాయకులతో ఆశ్రమం ఎప్పుడూ సందడిగా ఉండేది. బాలీవుడ్ తారలు హేమా మాలిని, శిల్పా శెట్టి, మనీషా కొయిరాలా, హృతిక్ రోషన్ కి కల్కి భగవాన్ అంటే బాగా గురి. హేమామాలిని కుమార్తె ఈషా డియోల్ ఆశ్రమంలో నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇక దక్షిణాదినుంచి హీరోయిన్ నిత్యామీనన్ ఎక్కువగా ఆశ్రమంలోనే తన సమయాన్ని గడిపేవారు. విదేశాలనుంచి ప్రత్యేకంగా ఇక్కడ దీక్ష చేపట్టడానికి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కల్కి బోధనలతో వారు ప్రభావితం అయ్యేవారు. నెలల తరబడి ఆశ్రమంలోనే ఉంటూ, ధ్యానం చేసుకుని వెళ్లేవారు.
కల్కి భగవాన్‌పై ఎన్నో వివాదాలు !
తమిళనాడుకి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ విజయ కుమార్.. కాలక్రంలో కల్కి భగవాన్ అవతారం ఎత్తారు. తనతోపాటు, తన భార్య కూడా దైవాంశ సంభూతురాలిగా ప్రచారం చేసుకుంటూ వరదయ్యపాలెంలో ఆశ్రమం స్థాపించారు. ఆశ్రమానికి వచ్చే భక్తులకు బోధన చేస్తూ ధ్యానం చేయిస్తూ తనను కల్కి భగవాన్ గా, తన భార్యను అమ్మ భగవాన్ గా పూజించేలా ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్రమానికి వచ్చేవారి వద్ద విరాళాలు సేకరిస్తూ వాటితో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. కల్కి పేరుతో చాలా చోట్ల సేవా సంఘాలు ఏర్పడ్డాయి. అన్నదానాలు, మెడికల్ క్యాంప్ లు.. ఒకటేంటి.. కల్కి పేరుతో చాలా కార్యక్రమాలే జరిగాయి. మెల్లగా ప్రచారం పెరిగింది. దింతో కల్కి ఆశ్రమానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. పాదపూజ కోసమే లక్షలు వసూలు చేస్తారన్న పేరు ఉంది.
అవతారం చాలించినట్లే !
ఆరోపణలు వచ్చినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆ తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి రావడం.. చాలామంది స్వామీజీలు చేసే పని ఇదే. అయితే కల్కి భగవాన్ మాత్రం ఆరోపణలు వచ్చిన తర్వాత సతీ సమేతంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఇంతవరకు బయటకు రాలేదు. అనారోగ్య కారణాలు, కుటుంబ గొడవలు వల్ల ఆయన పూర్తిగా ఆశ్రమానికి దూరంగానే ఉంటున్నారు. ఆశ్రమం వ్యవహారాలు, ఆస్తుల వ్యవహారాలన్నిటినీ ఆయన కుమారుడు కృష్ణాజీ చూసుకుంటున్నారు.