Steel plant Credit Politics : స్టీల్ ప్లాంట్‌పై అప్పుడే క్రెడిట్ గేమ్స్ - "ఈవోఐ" బిడ్డింగ్ ఆగిపోయిందా ? తెలంగాణ పాల్గొనడం లేదా ?
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి రావడానికి కారణమైన ఈఓఐలో తెలంగాణ పాల్గొనడం లేదా ? బిడ్ వేయడం లేదా ?
Steel plant Credit Politics : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతం ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విశాఖలో చేసిన ప్రకటన ఒక్క సారిగా వైరల్ అయింది. వెంటనే భారత రాష్ట్ర సమితి ముఖ్య నేతలంతా తమ వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని ప్రకటనలు చేసేశారు. ఏపీలో రాజకీయ పార్టీలు నోరెత్తలేకపోయాయని తాము పోరాటం చేయడంతోనే కేంద్రం వెనక్కి తగ్గిందని చెబుతున్నారు. అయితే కేంద్ర మంత్రి పూర్తిగా తాము ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గమని చెప్పడం లేదు. ప్రస్తుతానికి వెనక్కి తగ్గామంటున్నారు. అయితే అసలు బీఆర్ఎస్ తమ వల్లే వెనక్కి తగ్గిందని క్లెయిమ్ చేసుకోవడానికి కారణం .. మూలధనం, ముడి సరకు సరఫరా కోసం జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ . మరి ఇప్పుడు ఆ ఈవోఐ బిడ్డింగ్ ఆపేశారా ?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎక్కడి వరకూ వచ్చిందంటే ?
విశాఖ ఉక్కు తీవ్ర నష్టాల్లో ఉందని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం విశాఖ ఉక్కు విక్రయం లావాదేవీల పర్యవేక్షణకు ట్రాన్స్‌యాక్షన్ అడ్వైజర్ ను నియమించింది. లీగల్ అడ్వైజర్‌ను ఏర్పాటు చేసింది. ‘వాల్యూయేటర్’ నియామకం పూర్తయింది. కానీ ఇటీవలి కాలంలో తదుపరి ప్రక్రియను నిలిపివేశారు. కానీ ప్రైవేటు సంస్థల నుంచి మూలధనం సేకరించాలని మాత్రం నిర్ణయించారు.
మూలధనం సేకరణ కోసం ప్రకటన !
‘‘వర్కింగ్ క్యాపిటల్ లేదా ముడి పదార్థాలు సరఫరా చేస్తే.. దానికి బదులుగా స్టీల్ ఇస్తాం’’ అంటూ గతనెల 27వ తేదీన విశాఖ ఉక్కు యాజమాన్యం ఈవోఐ వెలువరించింది. ‘‘ఉక్కు, ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాం’’ అని తెలిపింది. స్టీల్ తయారీ సంస్థలతో అనుబంధం, అనుభవం ఉన్నవారెవరైనా బిడ్ వేయవచ్చునని స్పష్టం చేసింది. ‘‘స్టీలు తయారీకి సంబంధించిన ముడిపదార్థాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరఫరా చేసి... దానికి బదులుగా స్టీల్ ఉత్పత్తులను తీసుకోవచ్చు. లేదా... వర్కింగ్ క్యాపిటల్ ie నగదు సమకూర్చితే దానికి బదులుగా స్టీల్ ఉత్పత్తులను సరఫరా చేస్తారని ఈవోఐలో ఉంది.
ప్రైవేటీకరణకు మూలధన సేకరణకు సంబంధం లేదు !
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు.. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్డింగ్‌కు సంబంధం లేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకు, ప్రైవేటీకరణకు సంబంధం లేదు. ‘ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చితే... దానికి సమానమైన విలువగల స్టీల్ ఇస్తాం! ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండి’ అని విశాఖ స్టీల్స్ ‘ఆసక్తి వ్యక్తీకరణ’ జారీ చేసింది తప్ప... ఇలా మూలధనం సేకరించినందుకు యాజమాన్య హక్కులు ఒక్క శాతం కూడా రావు.
తెలంగాణ బిడ్ దాఖలు చేయదా ?
కేంద్ర మంత్రి ప్రకటన తర్వాత స్టీల్ ప్లాంట్ ఆ బిడ్ ను నిలిపివేసిందా అంటే.. అదేం లేదని స్టీల్ ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ బిడ్ యధావిదిగా కొనసాగుతుంది. ఆ బిడ్ కు ప్రైవేటీకరణకు సంబంధం లేదు. స్టీల్ ప్లాంట్ మూలధనం కోసం ఇచ్చిన బిడ్ అది. అందులోనే పాల్గొంటామని బీఆర్ఎస్ చెబుతోంది. పదిహేనో తేదీ లాస్ట్ డేట్. పధ్నాలుగో తేదీ సెలవు. అంటే పదిహేనో తేదీ ఒక్క రోజే మిగిలి ఉంది. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయడానికి మరొక్క రోజే సమయం ఉంది. కేంద్రం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గింది కాబట్టి తాము బిడ్ వేయడం లేదని చెప్పే అవకాశం ఉందని.. బిడ్ లో పాల్గొనే చాన్స్ లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.