CM Chandrababu: 'చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూస్తారు' - సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మధ్య నవ్వుల పువ్వులు
Andhrapradesh News: ఏపీలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. అప్పటి సీఎంను మళ్లీ చూస్తారంటూ చంద్రబాబు అనడంతో నవ్వులు పూశాయి.
Interesting Conversation Between Chandrababu And Nara Lokesh: ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని.. చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూపిస్తానని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం పింఛన్ల పంపిణీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం సహా మంత్రి లోకేశ్ (Nara Lokesh) పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగి.. నవ్వులు పూశాయి. గతంలో పరదాల సీఎంను చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని నారా లోకేశ్ అన్నారు. 'అధికారులు ఇంకా పరదాలు కడుతున్నారు సార్.. సెట్ అయ్యేందుకు టైమ్ పడుతుంది అనుకుంటా.?' అని లోకేశ్ అనగానే.. 'లేదు సెట్ అయ్యారు' అని సీఎం బదులిచ్చారు. 'ఇంకా కొన్ని చోట్ల కొంతమంది పరదాలు కడుతున్నారు సార్.. బతిమిలాడి తీయిస్తున్నాం' అని లోకేశ్ చెప్పగా.. 'ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు.' అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
'అప్పట్లో నువ్వు కుర్రాడివి'
చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూస్తారు..#PensionsPandugaInAP #NTRBharosaPension #NaraLokesh #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/KNLF4itwQv
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2024
ఇక ఎవరైనా సరే పాత రోజులు మరిచిపోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరిపై అయినా ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 'రివర్స్ పోయే బండిని పాజిటివ్ వైపు నడిపిస్తున్నాం. స్పీడ్ పెంచాలి. వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదు. ఆ ఆలోచనే రాకూడదు. ప్రారంభం కాబట్టి కాస్త స్లోగా వెళ్తున్నా. ఇక స్పీడ్ పెరుగుతుంది. ఒక్కసారి షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు. దానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతా చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివి. నీకు కూడా ఐడియా లేదు. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. ఇప్పుడు అంతలా ఉండదు కానీ తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించను. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా ఇది గుర్తు పెట్టుకోవాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సరదా సంభాషణ క్రమంలో సభలో నవ్వులు పూశాయి.
'ప్రజలకు సేవకులమే'
మేము ఎప్పటికైనా ప్రజలకు సేవకులుగా, మీకు అందుబాటులో ఉంటాం తప్ప, పెత్తందారులుగా ప్యాలెస్ లో ఉండమని చెప్తున్నా#PensionsPandugaInAP #NTRBharosaPension #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/LvmrmbrzTa
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2024
తాము ఎప్పటికీ ప్రజలకు సేవకులుగానే ఉంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. అంతే తప్ప పెత్తందారులుగా ప్యాలెస్‌లో ఉండమని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ఘన విజయం అందించారని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. అందరూ సమిష్టిగా కలిసి పని చేసి, సంపద సృష్టించి.. ఆదాయం పెరిగేలా చేసి.. దాన్ని ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమమని అన్నారు.