Srikakulam ZP Meeting : రోడ్లెయ్యకపోతే ఫిజియోథెరపిస్ట్‌ను పెట్టండి - ఈ డిమాండ్ వైఎస్ఆర్‌సీపీ నేతలదే ! ఎక్కడంటే ?
శ్రీకాకుళం జడ్పీ మీటింగ్‌లో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సమావేశం కల్లా ఇల్లు, రోడ్ల సమస్యలు పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు.
Srikakulam ZP Meeting : శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో వైఎస్ఆర్‌సీపీ సభ్యులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. రోడ్లును బాగు చేయకపోతే ఫిజియోధెరపిస్టును ఏర్పాటు చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తామన్న ఆప్షన్ను కోరుకున్న లబ్దిదారులకు కట్టి ఇస్తారా? లేదా? అని ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి లేవనెత్తిన అంశం మంత్రి అప్పలరాజుకి కోపం తెప్పించింది. విద్యుత్ సమస్యలపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, రణస్థలం జెడ్పీటీసీ టొంపల సీతారాం ప్రశ్నల వర్షం కురిపించారు. రోడ్ల నిర్మాణాలపై సభ్యులతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీ సభ్యులే ఇలా అనేకానేక సమస్యలు లేవనెత్తడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు.
ఎప్పుడూ లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్య నేతలందరూ జడ్పీ మీటింగ్‌కు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ సమస్యలను ప్రస్తావించారు. రోడ్లు, విద్యుత్, గృహనిర్మాణం, వంశధార సాగునీరు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ సాగింది. విద్యుత్ శాఖ సమస్యపై చర్చకు వచ్చేటప్పుడు సభ్యులు ఆ శాఖాధికారుల తీరును ఎండగట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు వివిధ రోడ్ల సమస్యలపై ప్రస్తావించారు. సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. వచ్చే సమావేశానికి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులులో చురుకుదనము లోపించిందని శ్ర భావంతో పనిచేయాలని స్పీకర్ తమ్మినేని హితవు పలికారు.
ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుంటే అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే వ్యవహరిస్తే కుదరదని స్పీకర్ స్పష్టం చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 21 రోడ్లు మంజూరు చేస్తే ఒక్కటైనా పూర్తిచేశారా అంటూ నిలదీశారు. కాంట్రాక్టర్లు పనులు చేపట్టకపోతే తక్షణమే రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని సూచించారు. అటువంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆయనతోపాటు కలెక్టర్ కూడా ఆదేశించారు. పలువురు జడ్పీటీసీలు లేవనెత్తిన అంశాలు పై స్పీకర్ స్పందిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారము పై ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఉందని ముఖ్యం గా రహదారుల భవనాల శాఖ, పంచాయతి రాజ్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్లు పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు. నిబంధనలు ప్రకారం పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరులో జాప్యం జరగదని, నిబంధనలు పాటించక పోతే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి వేరొకరికి అవకాశం ఇస్తామన్నారు.
అయితే టీడీపీకి చెందిన సభ్యులు సమస్యలు లేవనెత్తినప్పుడు ఇతర వైఎస్ఆర్‌సీపీ సభ్యులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. హిరమండలం జెడ్పిటిసి సాగిరి బుచ్చిబాబు మాట్లాడనివ్వకుండా ముప్పేటా దాడి చేశారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కాకుండా ఇతరులు ప్రవేశించడంతో గందరగోళం ఏర్పడింది. చివరికి వారు కూడా మాట్లాడటంతో జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మహిళా సభ్యుల తరపున వారి కుటుంబసభ్యులు రావడమే దీనికి కారణం.