Rains: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ - ఏపీలో ఆ 3 రోజులు భారీ వర్షాలు
Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో ఈ నెల 25, 26 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Rain Alert To AP And Telangana: దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ 2 రోజుల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అటు కోస్తాంధ్రలో సోమ, మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజలకు అలర్ట్
అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు వరి కోతలు, వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, ప.గో, పల్నాడు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో మళ్లీ వర్షాలు..
అటు, తెలంగాణలోనూ మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 28 వరకూ రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఈ నెల 29 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైరు, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి పూట చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.