AP Assembly House Commite : పెగాసస్ మాత్రమే కాదు డేటాచోరీపైనా విచారణ - మూడు నెలల్లో నివేదిక ఇస్తామన్న భూమన !
పెగాసస్ అంశంపై అసెంబ్లీ నియమించిన హౌస్ కమిటీ సమావేశం అయింది. పెగాసస్‌పైనే కాదని గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణ చేస్తామని ప్రకటించింది.
AP Assembly House Commite : తెలుగుదేశం హయాంలో పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏపీ అసెంబ్లీ నియమించిన హౌస్ కమిటీ వరుసగా రెండు రోజుల పాటు సమావేశం అయింది. మంగళవారం, బుధవారం కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో మళ్ళీ హౌస్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వనున్నారు. గత మార్చిలో ఈ సభా సంఘాన్ని నియమించారు. తొలి సారిగా మంగళవారం సమావేశమై కీలక అంశాలపై చర్చించారు.
హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్‌రావు, మద్దాళి గిరిధర్ సమావేశమయ్యారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్ వినియోగంతో పాటు ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి కూడా విచారించాలని నిర్ణయించారు. హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో పెగాసస్ స్పైవేర్ వాడారో లేదో తెలుసుకునే ప్రయత్నం చేశారు. పెగాసస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ఏపీ రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఏపీ అసెంబ్లీ మార్చిలో సభాసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
బెంగాల్‌కు వెళ్లి అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలన్న అభిప్రాయానికి కమిటీ వచ్చినట్లుగా చెబుతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనను సమగ్రంగా తెలుసుకునేందుకు బెంగాల్ వెళ్లి అక్కడి అసెంబ్లీ రికార్డుల్ని కూడా పరిశీలించాలని అసెంబ్లీ కమిటీ భావిస్తోంది. అసలు మమతా బెనర్జీ అలాంటి ప్రకటనే చేయలేదని టీడీపీ వాదిస్తోంది. ఎలాంటి ప్రకటన చేయకుండానే మమతా బెనర్జీ చేసినట్లుగా చెప్పుకుని హౌస్ కమిటీ విచారణ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసిందని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సమావేశం అనంతరం ఆరోపించారు. దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. అప్పట్లో ప్రయివేటు వ్యక్తుల ఫోన్లు టాప్ చేసింది. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామని ప్రకటించారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తామన్నారు. మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు కూడా ఒక అంశ మాత్రమేనన్నారు.