Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Andhra News: తాను హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉండేదన్న పవన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు.
Home Minister Vangalapudi Anitha Reaction On Pawan Comments: తాను హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉండేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్పందించారు. పవన్ అన్న దాంట్లో తప్పేమీ లేదన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడారు. 'రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కల్యాణ్ కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు. పవన్ మాట్లాడిన దానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. పిఠాపురం సభలో ఆయన మాట్లాడిన దానిలో ఎలాంటి రాజకీయం లేదని నాకు తెలుసు. త్వరలోనే ఆయనతో మాట్లాడతా.' అని అనిత తెలిపారు.
'నేను హోంశాఖ తీసుకుంటే.?'
తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితుల్ని పోలీసుల వేగంగా అరెస్టు చేయకపోవడంపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జడ్పీ హైస్కూల్‌లో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 'మమ్మల్ని విమర్శించే నాయకులందరికీ ఈ రోజు చెబుతున్నా. ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఈ మాత్రం ధైర్యం లేనప్పుడు పోలీసులు ఉండడం ఎందుకు.?. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి.?. నాయకులు ఉన్నది ఓట్లు అడగడానికేనా.?. బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా.?. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ చేసినట్లు క్రిమినల్స్‌కు చేయాలి.' అని పేర్కొన్నారు.
'గత ఐదేళ్లలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి సీఎం మాట్లాడలేదు. అప్పులు ఎలా వారసత్వంగా వచ్చాయో.. గత ప్రభుత్వ తప్పిదాలూ అలాగే వచ్చాయి. శాంతిభద్రతలు బలంగా అమలు చేయాలని పదే పదే చెప్పాను. శాంతి భద్రతల పరిరక్షణ అనే అలవాటు అధికారులకు తప్పింది. గత ప్రభుత్వంలో పోలీసులు, అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండబోవు. అత్యాచార నిందితుల్ని అరెస్టు చేయడానికి కులం ఎందుకు అడ్డం వస్తోంది. ఈ విషయం పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి. పోలీసులు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు.' అని పేర్కొన్నారు.
'మేం తప్పులు చేయం'
ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఏమీ తప్పులు చేయమని.. అలాగే ఒకరిద్దరు ఇబ్బంది పెట్టినా కానీ ఈ కూటమిని చెడగొట్టలేరని పవన్ స్పష్టం చేశారు. 'ఆడబిడ్డల మానప్రాణాల రక్షణకు బాధ్యత తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. గత ప్రభుత్వంలో మాదిరిగా పోలీస్ శాఖ ఉండకూడదని చెప్పాం. ప్రజలకు అండగా ఉండేది ఈ కూటమి ప్రభుత్వమే.' అని పవన్ పేర్కొన్నారు.