CID Notice To Narayana : ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో నారాయణ ఇంట్లోనే సీఐడీ విచారణ - హైకోర్టు కీలక ఆదేశాలు !
ఏపీ మాజీ మంత్రి నారాయణను ఇంట్లోనే విచారించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ ఎలైన్‌మెంట్ కేసులో సీఐడీ ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
CID Notice To Narayana : టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ కేసులో 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అధికారులు ఇచ్చిన నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. నారాయణ శస్త్ర చికిత్స చేయించుకున్నారని న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. హైదరాబాద్ లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు నుంచి అనుమతి పొంది ఇటీవల నారాయణ అమెరికాలో చికిత్స తీసుకుని తిరిగి వచ్చారు.
నారాయణపై ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేస్ !
అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.ఈ ఏడాది మే 10వ తేదీన మాజీ సీఎం చంద్రబాబునాయుడుసహా మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా, నారాయణను -2 గా సీఐడీ చేర్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు చేశారని అందిన ఫిర్యాదు ఆధారంగా 120బీ, 420, 34, 36,37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి పిర్యాదు చేశారు. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది కల్గించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.అయితే ఈ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలనిసుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
మరో కేసులో బెయిల్ రద్దు చేసిన తిరుపతి కోర్టు !
టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో నారాయణకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను చిత్తూరు జిల్లా కోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో చిత్తూరు జిల్లాలోని నెల్లేపల్లి హైస్కూల్ లో లీకైన టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో దర్శనమిచ్చింది. దీని వెనుక నారాయణ హస్తం ఉన్నట్టు చిత్తూరు జిల్లా పోలీసులు ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనను కోర్టులో హాజరు పర్చగా, నారాయణ 2014లోనే నారాయణ సంస్థల అధినేతగా తప్పుకున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిలును చిత్తూరు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దు చేసింది. నవంబరు 30వ తేదీ లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
నారాయణపై కక్ష సాధింపులంటున్న టీడీపీ !
అసలు ఇన్నర్ రింగ్‌రోడ్డే లేదని.. ఇక అలైన్‌మెంట్ మార్పు ఎక్కడిదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క గజం కూడా భూసేకరణ జరగని ప్రాజెక్టులో అవకతవకలు ఏమిటని ప్రశ్నిస్తోంది. అలాగే టెన్త్ పేపర్ లీక్ కాలేదని ప్రభుత్వం చెబుతూ.. నారాయణపై లీక్ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం తీరుపై న్యాయస్థానాల్లో ఎండగడతామని వారంటున్నారు.