Sankranti: దారులన్నీ సొంతూరి వైపే - హైదరాబాద్, విజయవాడ హైవేపై వాహనాల రద్దీ
Andhra News: సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ - విజయవాడ హైవేపై ట్రాఫిక్ జాం నెలకొంది. ప్రధాన టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Heavy Rush in Hyderabad to Vijayawada Highway: సంక్రాంతి పండుగకు పల్లెలు సిద్ధమవుతున్నాయి. ఉపాధి నిమిత్తం పట్టణాలకు వచ్చిన వారు తమ సొంతూరికి ఉత్సాహంగా పయనమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ (Vijayawada) జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ (Chowtuppal) పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు కూడళ్లు వద్ద ట్రాఫిక్ నిలిచిపోతుంది. టోల్ గేట్స్ వద్ద హ్యాష్ ట్యాగ్ ఉన్నా.. నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. పంతంగి (Panthangi) వద్ద టోల్ ప్లాజా దాటేందుకు దాదాపు 10 నుంచి 15 నిమిషాలకు పైనే పడుతోంది. దీంతో ట్రాఫిక్ నియంత్రణకు జీఎమ్మార్ 30 మంది అదనపు సిబ్బందిని నియమించింది. వారు మండల పరిధిలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, గుండ్లబావి క్రాసింగ్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. అలాగే, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాల రద్దీ నెలకొనగా.. అదనపు టోల్ బూత్స్ ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ కొంత మేర తగ్గింది. మొత్తం 18 టోల్ బూత్స్ ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్స్ తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రధాన టోల్ ప్లాజాల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటు, ప్రధాన బస్టాండ్లలోనూ రద్దీ నెలకొంది. ప్లాట్ ఫామ్స్ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ప్రయాణికులు తరలివస్తున్నారు.
వాహనదారులకు గమనిక
ఏదైనా ప్రమాదం జరిగితే రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రతి 20 కి.మీ ఓ క్రేన్, 30 కి.మీ అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే 100 లేదా వాట్సాప్ నెంబర్ 8712662111ను సంప్రదించాలని భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాహనదారులకు ఏ సమస్య ఉన్నా 1033ను సంప్రదించాలని పేర్కొన్నారు.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
అటు, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. తెలంగాణ నుంచి 4.484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఏపీఎస్ఆర్టీసీ సైతం హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 6,725 బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ముందు 1,600 బస్ సర్విసులు, సంక్రాంతి తరువాత 1,500 బస్ సర్వీసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది. వీటికి అదనంగా మరో 1000 బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నాలకు అదనపు వెయ్యి బస్సు సర్వీసులు నడుపనున్నట్లు చెప్పారు. అలాగే బెంగళూరు, చెన్నైల నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపురం, తిరుపతిలకు అదనపు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.