Weather Update: తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు... అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తున్నాయి. ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ వ్యాప్తంగా వర్షాలు
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో యానాంతో పాటు కోస్తాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మన్యం, మెట్ట, కోనసీమలో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, అమలాపురంలో వర్షాలు పడుతున్నాయి. మన్యంలో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, జి.పెదపూడి లంక, అరిగెలవారిపేట, లంక గ్రామాలు వశిష్ఠ గోదావరి నదికి మధ్యలో ఉంటాయి. గోదావరి వరదతో ఈ గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు మర పడవలను ఆశ్రయిస్తున్నారు.
కడప ఆర్టీసీ గ్యారేజ్ లోకి భారీగా వర్షం నీరు చేరింది. గ్యారేజీ మొత్తం చెరువుని తలపిస్తుంది. వర్షం నీటిలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోనూ భారీగా వర్షం కురిసింది. వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
తెలంగాణలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని చెరువు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతల చెరువు, రెడ్డికుంటలోకి భారీగా వర్షం నీరు చేరడంతో పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వాగులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుమ్మలవాగు, పెద్దవాగు, ఉదృతంగా వరదలతో ప్రవహిస్తున్నాయి. పంటపొలాలు మునిగిపోయాయి. వంతెనలు కోతకు గురై రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జూలూరుపాడు పంచాయతీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వరద నీరు ఇళ్లల్లోకి చేరుకొని ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిని చేతులతో ఎత్తి బయట పారేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులకు 2 నెలల క్రితం సమాచారం ఇచ్చినా డ్రైనేజీలలో పూడికలు తీయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రధాన రోడ్డు జూలూరుపాడు నుండి పాపకొల్లు వెళ్ళే రహదారికి మరియు కొయ్యకాలనీలలో డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 6, 2021
Also Read: హిందువుల పండుగలకే కరోనా వస్తుందా ? ఏపీ ప్రభుత్వానికి రఘురామ ప్రశ్న..!