Pawan Kalyan: జనసేన అంత బలహీనమా? ఇందులో పొత్తు ధర్మం లేదు - పవన్‌కు హరిరామ లేఖ
Harirama Jogaiah: జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా? అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు.
Pawan Kalyan Harirama Jogaiah: టీడీపీ - జనసేన కూటమి తమ మొదటి అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఏపీ కాపు సంక్షేమ సంఘం నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య స్పందించారు. పవన్ కల్యాణ్ తీరును హరిరామజోగయ్య తప్పుబట్టారు. జనసేనకు అంత తక్కువ సీట్లు కేటాయించడం సరికాదని అభిప్రాయపడ్డారు. టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా వారికి 24 సీట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అలాగే, జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు హరిరామజోగయ్య ఆదివారం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. జనసేన సైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకం ఉందా? అని ప్రశ్నించారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని.. ఒకరు ఒవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని హరిరామజోగయ్య అసహనం వ్యక్తం చేశారు.
జనసేన శక్తిని స్వయంగా పవన్ కల్యాణే తక్కువ అంచనా వేసుకుంటున్నట్లు అని అన్నారు. 24 సీట్ల కేటాయింపుతో జనసేనను సంతృప్తి పరచలేరని అన్నారు. వాళ్లు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటున్నారని.. పవన్ కల్యాణ్‌ను రెండున్నర ఏళ్లు సీఎంగా చూడాలనేది వారి కోరిక అని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను సంతృప్తి పరచకుండా వైసీపీని ఎలా ఓడించగలరని హరిరామజోగయ్య అన్నారు. అసలు మీరు ఏ ప్రాతిపదికన సీట్ల సర్దుబాటు చేసుకున్నారని అన్నారు. జన సైనికులకు కావల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదని.. పవన్ కల్యాణ్ పరిపాలన, అధికారం చేపట్టడం అని అన్నారు.