Satyakumar Car Attack : చివరి కారుకు రాయి తగిలింది, కారులో సత్యకుమార్ ఉన్నారో లేరో తెలియదు- ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్
Satyakumar Car Attack : బీజేపీ నేతల కారుపై దాడి ఘటనపై ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామని గుంటూర అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలిపారు.
Satyakumar Car Attack : అమరావతి ప్రాంతంలో బీజేపీ నేత సత్యకుమార్ కారుపై దాడి ఘటనపై కేసులు నమోదు చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ అన్నారు. గుర్తు తెలియని వ్యక్తి సత్య కుమార్ కాన్వాయ్ పై రాయి విసిరితే చివరి కారుకు రాయి తగిలిందన్నారు. సత్య కుమార్ ముందు కారులో ఉన్నారని తెలిపారు. దాడికి సంబంధించి సీసీ కెమెరా విజువల్స్ ను పరిశీలిస్తున్నామని తెలిపారు. బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. దాడికి సంబంధించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామన్నారు.
"సత్యకుమార్ కాన్వాయ్ లో చివరి కారుపై దాడి జరిగింది. ఈ ఘటనపై ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశాం. రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డికి పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. పబ్లిక్ మీటింగ్ లో రెచ్చగొట్టేలా మాట్లాడితే వాళ్లపై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. బీజేపీ నేత సత్యకుమార్ కారుపై దాడికి సంబంధించి ఇరు వర్గాలపై కేసులు పెట్టాం. మీడియా దీనిపై తప్పుగా వార్తలు వస్తున్నాయి."- ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్
"అమరావతి ఉద్యమం 1200వ రోజు కార్యక్రమం జరిగింది. మందడంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్ పై అభ్యంతరంగా మాట్లాడారు. ఆ కామెంట్స్ వైరల్ అవ్వడంతో మూడు రాజధానుల శిబిరం వద్ద టెన్షన్ స్టార్ట్ అయింది. దీంతో పోలీసులను అధిక సంఖ్యలో మోహరించాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాం. అయితే ఆ దారిలో బీజేపీ నేతల కాన్వాయ్ వచ్చాయి. మూడు రాజధానుల మద్దతుదారులు రోడ్డుకు అడ్డంగా కూర్చొన్నారు. వాళ్లు బీజేపీ కాన్వాయ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాలను అడ్డుకుని వారిని అక్కడ నుంచి పంపించేందుకు చూశాం. ఇరు వర్గాలు నినాదాలు చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి కారుపై రాయి విసిరారు. అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించి వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కారులో సత్యకుమార్ ఉన్నారని మాకు తెలియదు. ఆయన కిందకు కూడా దిగలేదు. లాస్ట్ కారుపై రాయి పడింది. ఆ కారులో సత్యకుమార్ ఉన్నారో లేరో దర్యాప్తులో తెలుస్తుంది." - పోలీసులు
సోము వీర్రాజు ఆగ్రహం
రాజధాని ఉద్యమానికి సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న బిజెపి నేత సత్య కుమార్ భౌతిక దాడికి పాల్పడటాన్ని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ దాడి జరిగిందని ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పార్టీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎంపీ సురేష్ కోరడాన్ని వీర్రాజు తప్పు పట్టారు. ఈ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మందడం వద్ద భారతీయ జనతా పార్టీ నేతలపై దాడి ఘటనకు అధికార పార్టీయే కారణమని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.