CM Jagan Oath Video : సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూపిస్తూ సర్జరీ, ఆపరేషన్ సక్సెస్!
CM Jagan Oath Video : గుంటూరు జిల్లాలోని ఓ ఆసుపత్రిలో రోగికి సీఎం జగన్ వీడియోలు చూపిస్తూ ఆపరేషన్ చేశారు.
CM Jagan Oath Video : మ్యూజిక్ వినిపిస్తూ, సినిమాలు చూపిస్తూ ఆపరేషన్ చేయడం ఇటీవల తరచూ చూస్తున్నాం. దీర్ఘకాలంగా ఫిట్స్ తో బాధపడుతున్న ఓ వ్యక్తికి సీఎం జగన్ వీడియో చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు తెలిపారు. ఎనిమిదేళ్లుగా ఓ వ్యక్తి ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఇటీవల కాలంలో రోజుకు రెండు, మూడుసార్లు ఫిట్స్ రావడంతో ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. అయితే ఆ వ్యక్తి ఆపరేషన్ అంటే భయపడిపోయాడు. అందుకు వైద్యులు అతడికి ఓ మార్గం సూచించారు. రోగి మెలకువగా ఉండగా సర్జరీ చేస్తామని చెప్పారు. రోగి తనకు ఇష్టమైన వీడియో పెట్టండని వైద్యులు కోరాడు. అందుకు వైద్యులు సరే అనడంతో రోగి సీఎం జగన్ ప్రమాణ స్వీకారం పెట్టాలని కోరారు. సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వీడియో చూపిస్తూ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. రోగికి ఇష్టమైన సీఎం ప్రమాణ స్వీకార వీడియోలను ల్యాప్‌టాప్‌లో ప్లే చేస్తూ సర్జన్ ఆపరేషన్ పూర్తి చేశారు. శనివారం గుంటూరు అరండల్‌పేటలోని శ్రీసాయి హాస్పటల్స్‌లో సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండటం ఇసుక త్రిపురవరం గ్రామానికి చెందిన పెద్ద ఆంజనేయులు(43) కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు ఎనిమిది సంవత్సరాలుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. తరచూ ఫిట్స్ రావడంతో అతడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆంజనేయులు బ్రెయిన్‌లో సుమారు ఏడు సెంటిమీటర్ల పరిమాణంలో ట్యూమర్ ఏర్పడిందని వైద్యులు గుర్తించారు. వైద్యులు ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించారు. కాలు, చేయి పనితీరును ప్రభావితం చేసే మెదడులో కణితి ఉండడంతో రోగి మెలకువగా ఉండగానే సర్జరీ చేశామని న్యూరో సర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత నెల 25వ తేదీన ఆపరేషన్ చేశామని వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అతడికి ఇష్టమైన అగ్నిపర్వతం సినిమా, సీఎం జగన్ వీడియోలు ఎదురుగా ఉన్న ల్యాప్ టాప్ ప్రదర్శించారు. మామూలుగా అయితే మెదడుకు సర్జరీ చేయాలంటే జనరల్ ఎనస్థీషియా ఇస్తుంటారు. కానీ కణితి మెదడులో సున్నిత ప్రాంతంలో ఉండడంతో స్కాల్ప్ బ్లాక్ ఎనస్థీషియా ఇచ్చి సర్జరీ చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం రోగి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు ప్రకటించారు.
దృష్టి మళ్లించడానికే
ఇటీవల హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మెగాస్టార్ చిరంజీవి అడవి దొంగ సినిమా చూపించి ఓ మహిళకు సర్జరీ చేశారు వైద్యులు. ఈ విధంగానే గుంటూరులోని శ్రీసాయి హాస్పిటల్ వైద్యులు రోగికి సర్జరీ చేశారు. ఆంజనేయులు అనే రోగికి న్యూరో సర్జన్‌లు మత్తు ఇవ్వకుండానే కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా, సీఎం జగన్ వీడియోలు చూపిస్తూ బ్రెయిన్ లో ట్యూమర్ ను తొలగించారు. అయితే ఆపరేషన్ చేస్తున్న సమయంలో రోగికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా వీడియోలు చూపించామని డాక్టర్లు తెలిపారు. మనసును మళ్లించేందుకు అగ్నిపర్వతం సినిమా, సీఎం జగన్ వీడియోలు చూపించామన్నారు.