Guntur Crime : ఆన్లైన్ రుణ యాప్ లపై మహిళా కమిషన్ సీరియస్, డీజీపీకి లేఖ
Guntur Crime : ఆన్ లైన్ రుణ యాప్స్ ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ వివాహిత వేధింపులకు ఆత్మహత్యకు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.
Guntur Crime : లోన్ యాప్స్ వేధింపులకు మరొకరు బలైయ్యారు. గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన వివాహిత ప్రత్యూష్ లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మంగళగిరి డీఎస్పీ రాంబాబు మీడియాతో మాట్లాడారు. చినకాకానిలో వివాహిత ప్రత్యూష ఆన్ లైన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకుందని తెలిపారు. లోన్ చెల్లించినా ఆమెను వేధించినట్లు తెలుస్తోందన్నారు. ప్రత్యూషకు లోన్ ఇచ్చిన వారు ఫోన్ లో వేధించారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. వేధింపులు తీవ్రంగా ఉండడం, స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి బెదిరించడం చేశారని గుర్తించామన్నారు. లీగల్ గా రికవరీ చేస్తే ఇబ్బంది లేదు కానీ డబ్బులు వసూలు కోసం అసభ్యంగా మాట్లాడడం, వేధిస్తే ఊరుకునేది లేదని డీఎస్పీ హెచ్చరించారు. ప్రత్యూషకు ఫోన్ చేసి వేధించివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నమొత్తం లోన్ తీసుకుంటున్న పేదలను ఈ యాప్స్ టార్గెట్ చేసి వేధిస్తున్నారన్నారు. పోలీసుల దృష్టికి వచ్చిన ప్రతి ఘటనపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ రాంబాబు తెలిపారు.
ఆన్లైన్ రుణ యాప్ లపై మహిళా కమిషన్ సీరియస్
ఆన్‌లైన్ రుణ యాప్ ల వలలో చిక్కి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తేలికగా రుణాలు అంటగట్టి వడ్డీల మీద వడ్డీలు వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్న రుణయాప్‌లపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మంగళగిరిలోని నవులూరుకు చెందిన జాస్తి చౌదరి ఆన్లైన్ మోసానికి గురై చెరువులో దూకి చనిపోగా తాజాగా అదే మంగళగిరిలో మరో బాధితురాలు ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పంది. ఈ ఘటనలపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి భర్త రాజశేఖర్ తో ఆమె మంగళవారం ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ఈ ఘటనలను సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి రుణ యాప్ ల వేధింపులకు మరొకరు బలికాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డీజీపీకి లేఖ
రుణ యాప్ లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ పంపారు. రుణ యాప్ లను తొలగించేందుకు వెంటనే ప్లేస్టోర్ లను సంప్రదించడం మంచిదన్నారు. రుణ యాప్ ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రుణ యాప్ ల వేధింపులపై సమగ్ర నివేదిక సమర్పించాలని లేఖలో వాసిరెడ్డి పద్మ కోరారు.