Ward Employees Sulabh Comeplex Duties : వార్డు సచివాలయ ఉద్యోగులకు సులభ్ కాంప్లెక్స్ డ్యూటీలు - రోజుకు రూ. 5వేలు టార్గెట్ కూడా !
వార్డు సచివాయ ఉద్యోగులకు సులభ్ కాంప్లెక్ దగ్గర డ్యూటీలు వేశారు గుంటూరు కార్పొరేషన్ అధికారులు. రోజుకు రూ. ఐదు వేలు కలెక్షన్లు సాధించాలని టార్గెట్ పెట్టారు.
ఆర్టీసీ బస్సు దగ్గర టీ అమ్ముతూ దొరికి పోతాడు అహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు. కానీ తాను తాను కాదని చెప్పడానికి చిత్ర విచిత్ర వేషాలు వేస్తూ వెళ్లిపోతాడు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు గుంటూరులోని వార్డు సచివాలయ అడ్మిన్లు, సెక్రటరీలకు వచ్చింది. అహనా పెళ్లంట సినిమాలో కోట తన కోసం టీ అమ్ముకున్నాడు... అది వినడానికి కాస్త గౌరవంగానే ఉంది కానీ గుంటూరు వార్డు సచివాలయ అడ్మిన్లు, సెక్రటరీలకు మాత్రం ప్రభుత్వం తమకేమీ పని ఇచ్చిందో చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిపడాల్సిందే. విధులు నిర్వహిస్తూ ఎవరికైనా మొహం మాస్క్‌లో దాచుకోవాల్సిందే. ఇంతకూ వారికి ఎక్కడ డ్యూటీ వేశారో తెలుసా..? సులభ్ కాంప్లెక్స్‌ల దగ్గర.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని పే అండ్ యూజ్ టాయిలెట్లను నిర్మించింది. పలు సెంటర్లలో ఇవి ఉన్నాయి. వీటి వద్ద వార్డు సచివాలయ అడ్మిన్లు, సెక్రటరీలకు డ్యూటీ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు అదనపు కమిషనర్ నిరంజన్. డ్యూటీ చేస్తే సరిపోదు.. రోజుకు ఇంత అని ఖచ్చితంగా వసూలు చేయాలని టార్గెట్ కూడా పెట్టారు. గాంధీ పార్క్ వద్ద ఉన్న మరుగుదొడ్ల దగ్గర రోజుకు రూ. ఐదు వేలు వసూలు చూపించాలి. మార్కెట్ దగ్గర ఆ టార్గెట్ రూ. రెండు వేలు. ఇతర చోట్ల రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టార్గెట్ పెట్టారు. ఎంతైనా విధులు నిర్వహించి టాయిలెట్లను వాడుకోవడానికి వచ్చిన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్‌కు జమ చేయాలన్నమాట. టాయిలెట్ల దగ్గర డ్యూటీ కేటాయించిన వారిలో ఓ మహిళా వార్డు సెక్రటరీ, అడ్మిషన్ కూడా ఉన్నారు.
గుంటూరు కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన ఈ ఉత్తర్వులు చూసి ఉద్యోగులు ఉలిక్కి పడ్డారు. సోషల్ మీడియాలోనూ ఈ ఉత్తర్వులు వైరల్ అయ్యాయి. దీనిపై కార్పొరేషన్ అధికారులు స్పందించారు. టాయిలెట్ల నిర్వహణను చూసే కాంట్రాక్ట్ ముగిసిపోయిందని.. కొత్తగా ఎవరికీ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకూ సచివాలయ అడ్మిన్లకు బాధ్యతలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
సులబ్ కాంప్లెక్స్ ల వద్ద రుసుము వసూలు చేసేందుకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు షిఫ్ట్ లు వారీగా డ్యూటీలు వేయటంపై గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల వద్ద విధులు నిర్వహించడానికి పట్టభద్రులు, పోస్టు గ్రాడ్యుయేట్లు డాక్టరేట్లు అవసరమా అని ప్రశ్నించారు. ఉద్యోగులను కించపరిచే విధంగా కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్న తీరుతో వ్యవస్థకు వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసే అధికారులకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేస్తూ ఉద్యోగుల మనోభావాలు గౌరవించే విధంగా వారికి కేటాయించిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.