Gudivada High Tension : గుడివాడలో ఉద్రిక్తత, టీడీపీ నేత రావిని చంపుతామని బెదిరింపు కాల్!
Gudivada High Tension : గుడివాడలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ గుడివాడ ఇంఛార్జ్ రావి వెంకటేశ్వరరావురు కాల్ చేసి చంపుతామని వైసీపీ నేత బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Gudivada High Tension : గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంపేస్తామని వైసీపీ నేత మెరుగుమాల కాళీ ఫోన్ చేసి బెదిరించాలని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రేపు రంగా వర్థంతి కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. రంగా వర్థంతి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ కుట్ర చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మెరుగుమాల కాళీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడని టీడీపీ నేతలు అంటున్నారు. రావిని చంపేస్తామని బెదిరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దమ్ముంటే రావిని టచ్ చేయాలని కార్యకర్తలు సవాల్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగుతున్నారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తేలేంతవరకు కదిలేది లేదంటూ టీడీపీ కార్యక్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీ కార్యకర్తలు జై రావి అంటూ నినాదాలు చేస్తున్నారు. కవర్లతో పెట్రోల్ తీసుకువచ్చిన కొందరు యువకులు రోడ్లపైకి విసిరినట్లు తెలుస్తోంది.
లోకేశ్ ఫైర్
ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. గుడివాడలో టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుని చంపేస్తామని బెదిరిస్తూ..ఆస్తులు ధ్వంసం చేసి, టీడీపీ కార్యకర్తలపై గడ్డం గ్యాంగ్ దాడి చేశారని లోకేశ్ ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడలో గడ్డం గ్యాంగ్ కి గుండు కొట్టించే రోజు అతి దగ్గర్లో ఉందంటూ ట్వీట్ చేశారు. అధికారపక్షం నేతలు రాళ్లు వేసినా, భౌతిక దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తాం అంటే తమ దగ్గర అంత కంటే పెద్ద రాళ్లే ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు సైకో పాలనకి చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారనే విషయం సర్వేల్లో తేలడంతోనే వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. గుడివాడ టీడీపీ నేత రావిపై బెదిరింపులు, దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
గుడివాడలో గడ్డం గ్యాంగ్ కి గుండు కొట్టించే రోజు అతి దగ్గర్లో ఉంది. అధికారపక్షం రౌడీలు రాళ్ళు వేసినా, భౌతిక దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తాం అంటే మా దగ్గర అంత కంటే పెద్ద రాళ్ళే ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. pic.twitter.com/oQR0y8B32M
— Lokesh Nara (@naralokesh) December 25, 2022
పుంగనూరులో టీడీపీ కార్యకర్త అరెస్టు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం చేపట్టారు. మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లె్క్సీలు ఏర్పాటు చేశారు. మండలంలోని నడిం గడిదేసిలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్త నవీన్ కుమార్ యాదవ్ పొలాల్లో వైసీపీ బ్యానర్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే బ్యానర్లు ఇక్కడ పెట్టొదని చెప్పడంతో వైసీపీ నేతలు ఆగ్రహంతో నవీన్ కుమార్ యాదవ్ ఇంటిపై దాడికి యత్నించారు. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకుని నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొన్నారు. నవీన్ కుమార్ వైసీపీ బ్యానర్లను చింపేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నవీన్ అరెస్టు చేసిన పోలీసులు అతనిని స్టేషన్ కు తరలించారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని నవీన్ భార్య ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని నవీన్ కు మద్దతు తెలిపారు. వైసీపీ నేతలే తమ ఇంటిపై దౌర్జన్యం చేశారని నవీన్ భార్య ఫిర్యాదు చేశారు. నవీనకుమార్ యాదవ్ భార్య మాట్లాడుతూ తన భర్త ప్రాణానికి ముప్పు ఉందని ఆవేదన చెందారు. నవీన్ యాదవ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని పీఎస్ ముందు నవీన్ భార్య, టీడీపీ నాయకుల నిరసన తెలిపారు. తన భర్తను చూపించాలని పోలీసులను నవీన్ యాదవ్ భార్య డిమాండ్ చేశారు.