AP Exit Poll Results 2024 LIVE: ఏపీ ఎన్నికలపై ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2024 లైవ్ అప్‌డేట్స్
Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మే 13న జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ (ABP CVoter Exit polls 2024) అప్‌డేట్స్.
LIVE
Background
AP Assembly Election Exit Poll 2024 LIVE Updates: తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశం ఏపీ ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఓట్ల లెక్కింపు జూన్ 4న మొదలుకానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అయితే జూన్ 1న ఏడో దశ లోక్‌సభ పోలింగ్ ముగియడంతో ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ సీఓటర్ తో కలిసి ఎగ్జిట్ పోల్స్ (ABP CVoter Exit polls 2024) ఫలితాలు విడుదల చేస్తోంది. సాయంత్రం ఆరున్నర గంటల తరువాత ఎగ్జిట్స్ పోల్స్ ఒక్కొక్కటిగా ఆయా సంస్థలు విడుదల చేస్తాయి.
తొలిఫలితం కొవ్వూరు...
కట్టుదిట్టమైన భద్రత నడుమ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి ఫలితం కొవ్వూరు(Kovvur), నరసాపురం(Narasapuram)లో వెలువడనుంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అన్నిటికన్నా ముందు ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. ఒక్కో రౌండు పూర్తవడానికి గరిష్ఠంగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు మాత్రమే పట్టే అవకాశం ఉంది. కాబట్టి..ఈ రెండు ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. రంపచోడవరం(Rampachodavaram), చంద్రగిరి(Chandragiri) నియోజకవర్గాల్లో మొత్తం 29 రౌండ్లలో ఓట్లు లెక్కించాల్సి ఉన్నందున...అన్నింటికన్నా చివర ఈ రెండు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అలాగే భీమిలి(Bheemili), పాణ్యం(Panyam) నియోజకవర్గాల ఫలితా కోసం కూడా రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 25 రౌండ్లు చొప్పున ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది.
లెక్కింపు ప్రక్రియ సాగేది ఇలా
ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఉదయం 4 గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 5 గంటలకు వారికి ఏయే టేబుళ్లు కేటాయించారన్న సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా.... తొలుత ఆర్మీ సర్వీస్ ఉద్యోగుల ఓట్లు ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) ఓట్లు లెక్కించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి అరగంట సమయం పట్టనుంది. ఆ తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ను తెరిచి ఓట్లు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను సిద్ధం చేశారు. పోలింగ్ బూత్ సీరియల్ నెంబర్లు ఆధారంగా వరుస క్రమంలో ఈవీఎం(EVM)లు తెరిచి ఓట్లు లెక్కించనున్నారు. అంటే 14 టేబుళ్లపై తొలుత 1 నుంచి 14 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలు తెచ్చి పెట్టనున్నారు. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో వాటిని తెరిచి లెక్కించనున్నారు. దీంతో తొలి రౌండ్ పూర్తవుతుందన్నమాట... ఆ తర్వాత రెండో రౌండ్‌లో 15 నుంచి 29 పోలింగ్ బూత్‌ల ఈవీఎంలు తెచ్చి పెట్టనున్నారు.
ఈ విధంగా ఒక్కో రౌండ్ పూర్తి చేసుకుంటూ వెళ్లనున్నారు. ఏదైనా ఈవీఎంలో సమస్య తలెత్తినప్పుడు ఆ పోలింగ్ బూత్ ఈవీఎం పక్కనపెట్టి ఆ తర్వాత వరుస సంఖ్యలో ఉన్న బూత్ నుంచి లెక్కించుకుంటూ వెళ్తారు. పక్కన పెట్టేసిన ఈవీఎంను చివరిలో మరోసారి చెక్ చేయనున్నారు. అప్పటికీ వీలుకాకుంటే ఆ పోలింగ్ బూత్‌లోని వీవీప్యాట్(V.V.Pat) స్లిప్‌లు లెక్కించి వాటినే ఓట్లుగా పరిగణించనున్నారు. అలాగే ఈవీఎంల లెక్కింపు పూర్తయినా తుది ఫలితాలు ప్రకటించరు. పోలింగ్ బూత్‌ల సీరియల్ నెంబర్లన్నీ చిట్‌లపై రాసి ఓ బాక్స్‌లో వేయనున్నారు. లాటరీ ద్వారా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎన్నుకుని వాటి వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించనున్నారు. ఈవీఎంల్లో వచ్చిన ఓట్లకు, వీవీప్యాట్ ఓట్లకు సరిపోలితే సరి లేకుంటే మూడుసార్లు లెక్కించనున్నారు. ఈ మూడుసార్లు కూడా రెండు ఫలితాలు సరిపోకపోతే....వీవీపీ ప్యాట్ స్లిప్‌లనే అసలైన ఓట్లుగా భావించి వాటినే పరిగణలోకి తీసుకోనున్నారు.
111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం లోపే ఫలితాలు
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయనున్నారు. మరో 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఫలితాలు సాయంత్రానికి అందుబాటులోకి రానున్నాయి. మరో 4 నియోజకవర్గాలు మాత్రమే రాత్రి వరకు లెక్కింపు సాగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 9 గంటల కల్లా మొత్తం ప్రక్రియ ముగించేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఉదయం 11 గంటల కల్లా ఫలితాల ట్రెండ్ వెలువడే అవకాశం ఉంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఫేక్ ప్రచారం - అసలు నిజం ఇదే
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ఏబీపీ సీఓటర్ రిలీజ్ చేసిందని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందులో వైఎస్ఆర్‌సీపీకి ఆధిక్యం ఇచ్చినట్లుగా కార్డులు షేర్ చేశారు. ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ను ఓ తెలుగు టీవీ చానల్ ప్రసారం చేసినట్లుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఏబీపీ సీఓటర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించలేదు. వాట్సాప్‌లలో చేస్తున్న ప్రచారం అంతా ఫేక్ అని నిర్ధారిస్తున్నాం.
ఏపీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ - న్యూస్ 18 అంచనా ఏంటంటే?
'న్యూస్ 18' ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఏపీలో టీడీపీకి 19 -22 ఎంపీ స్థానాలు, వైసీపీ 5-8, ఇతరులు 0 స్థానాలు కైవసం చేసుకుంటాయని తేలింది.
'ఆరా మస్తాన్' ఎగ్జిట్ పోల్స్ - ఏపీలో వైసీపీదే అధికారం అని అంచనా
'ఆరా మస్తాన్' ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఏపీలో వైసీపీ 94-104, టీడీపీ కూటమి 71-81 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుందని తేల్చింది. అటు, పార్లమెంట్ సీట్ల విషయానికొస్తే వైసీపీ 13 - 15, టీడీపీ కూటమి 10 - 12 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది.
ఏపీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ - 'పయనీర్' సంస్థ అంచనా ఏంటంటే.?
'పయనీర్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం టీడీపీ 20+ ఎంపీ స్థానాలు, వైసీపీ 5, ఇతరులు 0 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు తేలింది.
ఏపీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ - ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్
'ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్' ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏపీలో టీడీపీ 18+ ఎంపీ స్థానాలు, వైసీపీకి 7, ఇతరులు 0 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు తేలింది.