Andhrapradesh News: ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం - ప్రభుత్వం జోక్యంతో బాధితులకు ఆర్థిక సాయం
NTR District News: ఎన్టీఆర్ జిల్లా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాద బాధితులకు ప్రభుత్వ జోక్యంతో కంపెనీ యాజమాన్యం పరిహారం అందజేసింది. మృతుని కుటుంబానికి రూ.50 లక్షలు అందించింది.
Exgratia Sanctioned To Cement Factory Accident Victim Families: రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రమాద బాధితులకు కంపెనీ యాజమాన్యం ఆర్థిక సాయం అందించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవాల వెంకటేశ్ కుటుంబానికి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని కంపెనీ యాజమాన్యం అందజేసింది. క్షతగాత్రుల కుటుంబానికి కలెక్టర్ సృజన, ఎమ్మెల్యే శ్రీరాం, రాజగోపాల్ చేతుల మీదుగా చెక్కులు అందించారు.
కాగా, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం బాయిలర్ పేలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు, సిబ్బంది క్షతగాత్రులను జగ్గయ్యపేట, విజయవాడ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే, బాధితులను కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు కంపెనీ కార్యాలయంపై దాడి చేయగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ఫ్యాక్టరీలో ప్రీ హీటర్ లోపమే కారణమని ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. దీనిపై క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
సీఎం చంద్రబాబు ఆరా
మరోవైపు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయం, పరిహారంపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించింది. గాయపడిన వారికి రూ.25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు అందజేసింది.