Kadiyam Flowers: వరుస ముహూర్తాలతో అమాంతం పెరిగిన పూల ధరలు, కడియం మార్కెట్లో రేట్లు ఇలా
వివాహ వేడుకల్లో ఇటీవల కాలంలో తాజా పూల వినియోగం బాగా పెరిగింది. మండపాల ముస్తాబుకు పూలు వాడకం పెరగడంతో పూల రేట్లకు రెక్కలొచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక మార్కెట్లో పూల రేట్లు ఇలా ఉన్నాయి.
వివాహ వేడుకల్లో ఇటీవల కాలంలో తాజా పూల వినియోగం బాగా పెరిగింది. వరుస మూహూర్తాలు, మండపాల ముస్తాబుకు పూలు వాడకం పెరగడంతో పూల రేట్లకు రెక్కలొచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక మార్కెట్లో పూల రేట్లు ఇలా ఉన్నాయి.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభించినా వ్యాధి తీవ్రత అంతగా లేకపోవడంతో ఈసారి పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలు జరుగుతున్నాయి. మాఘమాసం వరుస ముహూర్తాలతో ఇప్పుడు అన్నింటి ధరలు కొండెక్కాయి. పెళ్లి మండపాలు దగ్గర నుంచి నిత్యవసర సరుకుల వరకూ అన్నీ ప్రియం అయ్యాయి. ఇక పూల ధరలైతే చెప్పక్కర్లేదు. తూర్పుగోదావరి జిల్లాలో పూలకు పెట్టింది పేరైన కడియపులంక నర్సరీలు. వరుస పెళ్లిళ్ల మూహూర్తాలతో కడియపులక పూల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ కూడా పూల రేట్లు అమాంతం పెరిగిపోయాయి.
వివాహాది శుభకార్యాలు అధికంగా ఉండడంతో పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ముఖ్యంగా కల్యాణ మండపాల ముస్తాబుకు ఉపయోగించే బెంగళూరు పూల రకాల ధరలు రెండు రోజుల నుంచి భారీగా పెరిగాయి. ట్రెండ్ మారడంతో ఇప్పుడు అంతా బెంగళూరు పూల పైన మోజుపడతున్నారు. దీంతో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రత్యేక వాహనాలపై బెంగుళూరు ప్రాంతం నుంచి వీటిని దిగుమతి చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతర్రాష్ట్ర మార్కెట్లో గత మూడు రోజులుగా అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. స్థానికంగా ఉండే చామంతి కేజీ రూ.200 పలకగా బంతి రూ.వంద, లిల్లీ రూ.400, మల్లెపూలు రూ.1400, గులాబీ రూ.200, కనకాంబరం బారు రూ.300 పలుకుతున్నాయి. స్థానికంగా లభ్యమయ్యే పూలు కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అలంకరణ పూలను ప్రస్తుతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
గతంలో ప్లాస్టిక్ పూలతో కల్యాణ మండపాలను అలంకరించేవారు. ఆ తర్వాత రోజుల్లో బంతి చామంతి, లిల్లీ వంటి వాటితో ఈ కల్యాణ మండపాలు తయారు చేసేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఆకులు, పువ్వులతో ముస్తాబవుతున్నాయి. ఇటువంటి కల్యాణ మండపాలపై వివాహం జరుపుకోవడానికి వధూవరులు ఇష్టపడుతున్నారు. పెళ్లి వేడుక కెమెరాల్లో అద్భుతంగా కన్పించేందుకు ఖరీదైన పువ్వులుతో ముస్తాబు చేసిన మండపాలు ఎంతో దోహద పడుతున్నాయి. అందుకే ఈ పూలకు అంత డిమాండ్ ఏర్పడుతుంది. కట్టలు కట్డి ఉండే ఈ అలంకరణ పూల ధరలు గురువారం ఇలా ఉన్నాయి.
ఒక్కొక్క కట్ట ధరలు(రూపాయల్లో)
1.జర్బరా......200
2.కిసందా.....350
3.కార్నెస్......450
4.జిప్స్.......300
5.నంది వర్దన..400(కేజి)
6.బ్లూ డైజీ...200
7.బ్లాగ్........250
8.గ్రాస్.........40
9.గులాబీ.....450
10.పెళ్లి దండలు(జత)...రూ.మూడు వేలు
11. పెళ్లి జడ......700