CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు
CM Jagan : సీఎం జగన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.కోటి మంజూరు చేసి చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లు అందించారు.
CM Jagan : కోనసీమలో ఇటీవల వరదల ఉద్ధృతికి లంక ప్రాంతాలన్నీ తీవ్ర ఇబ్బందులకు గురై అయ్యాయి. ఆ పరిస్థితిని, ప్రజలకు అందుతున్న సహాయాన్ని స్వయంగా పరిశీలించేందుకు కోనసీమ వచ్చారు ముఖ్యమంత్రి సీఎం జగన్. సరిగ్గా ఆ సమయంలో ఓ నిరుపేద దంపతులు నిస్సహాయ స్థితిలో తమ పాప దీనస్థితిపై ప్లకార్డు పట్టుకునిపట్టుకుని నిల్చున్నారు. వెళ్తున్న కాన్వాయ్ ఆగింది. ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. ఆ క్షణంలోనే జిల్లా కలెక్టర్ ను పిలిచి ఏదో చెప్పారు. కట్ చేస్తే ఆ తల్లిదండ్రులకు ఊహించని కబురు వచ్చింది.
హనీ వైద్యానికి రూ.1కోటి మంజూరు. ఖరీదైన ఇంజక్షన్ల పంపిణీ. అరుదైన “గాకర్స్’’బారినపడ్డ చిన్నారి పరిస్థితిపై చలించిన సీఎం. కోనసీమ వరదప్రాంతాల పర్యటనలో ప్లకార్డు ప్రదర్శించిన చిన్నారి తల్లిదండ్రులు. కాన్వాయన్ ఆపి మాట్లాడిన సీఎం. చిన్నారి బాధ్యతను తీసుకుంటానని ఆరోజు హామీ ఇచ్చిన సీఎం. pic.twitter.com/N364inPm6B
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 2, 2022
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి
డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కారామేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతుల రెండున్నర సంవత్సరాల చిన్నారి హనీ అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి చికిత్స చెయ్యించేందుకు ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్థోమతలేదు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ. కోటి బడ్జెట్ కేటాయించారని కలెక్టర్ తెలిపారు. చిన్నారి హనీకు పుట్టుకతో ఈ వ్యాధి వచ్చిందని ఈ వ్యాధిమూలంగా లివర్ పనిచేయదని జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా తెలిపారు.
13 ఇంజెక్షన్లు అందజేత
ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరఫున ఉచితంగా 13 ఇంజెక్షన్లను చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. ఇటీవల గోదావరి వరదలు మూలంగా వరద ప్రాంతాల సందర్శనకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఆ దంపతులు ప్లకార్డు ప్రదర్శించారు. కాన్వాయ్ ఆపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ దంపతులను పిలిచి పాప అనారోగ్యంపై సమాచారం తెలుసుకున్నారు. సీఎం వెంటనే స్పందించి అక్కడికక్కడే ప్రభుత్వ ఉన్నతాధికారులు, వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ను సంప్రదించి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఆ మేరకు కలెక్టర్ ప్రభుత్వానికి పాప వైద్యానికి సంబంధించి ప్రతిపాదనలు పంపారు. చిన్నారి హనీ వైద్యానికి ముఖ్యమంత్రి రూ. కోటి బడ్జెట్ కేటాయించారని కలెక్టర్ తెలిపారు. ఈ గాకర్స్ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజెక్షన్లను మంజూరు చేసింది. ప్రస్తుతం 13 ఇంజెక్షన్లను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి పంపింది.
రూ.కోటి విలువైన ఇంజెక్షన్లు
ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ 1,25,000 రాయితీతో రూ.74,000 లకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగా బాధితులకు అందిస్తుంది. ఈ ఇంజెక్షన్ అమెరికాలో తయారవుతుందని ఇప్పటివరకు రూ 10,08,000 విలువచేసే ఇంజెక్షన్లను ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ ఇంజెక్షన్ 15 రోజులకు ఒకసారి రెగ్యులర్ గా పాపకి ఇవ్వాలని సూచించారు. పాప భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి స్పందించి ఉదారంగా సహకారం అందించారన్నారు. పాప భవిష్యత్తుకు కూడా ప్రణాళికను చేశామని కలెక్టర్ తెలిపారు. పింఛన్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని, దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు 14 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
సీఎం జగన్ భరోసాతో
రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి వైద్యం ఇప్పటివరకు అందించలేదని మొదటిగా స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ తరహా వ్యాధి నివారణ చర్యలు ప్రారంభించారు. శరీరంలో జీవక్రియలకు లివర్ చాలా ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల రెండు సార్లు చిన్నారికి ఇంజెక్షన్లు అందించాల్సిందన్నారు. ముఖ్యమంత్రిని కలవగానే ఎంతో ఉదాహరoగా స్పందించి ఎంత ఖర్చయినా పర్వాలేదని, ప్రభుత్వపరంగా ఆదుకుంటానని భరోసా కల్పించారని చిన్నారి తండ్రి కొప్పాడ రాంబాబు అన్నారు. భరోసా ఇచ్చిన రెండు నెలల్లో వైద్య సేవలు ఆరంభంకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నారి తల్లి నాగలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి వ్యాధి ఏ ఒక్కరికి రాకూడదని అన్నారు. తమది పేద కుటుంబమని వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని అండగా నిలవడంతో చిన్నారి హనీ భవిష్యత్తు పై ఆశలు చిగురించాయని తెలిపారు.