DL Ravindra Reddy : విజయమ్మ , షర్మిల ప్రాణాలకు ముప్పు - జగన్ వల్లేనని డీఎల్ రవీంద్రారెడ్డి అనుమానం !
విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని డీఎల్ రవీంద్రారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
DL Ravindra Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ విజయమ్మకు, వైఎస్ షర్మిలకు ముప్పు పొంచి ఉందని ..వారిద్దరు జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు దగ్గరపడుతున్న కొద్దీ వారిద్దరికి జగన్ వల్ల ప్రమాదం పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మైదకూరులో మీడియాతో మాట్లాడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా జగన్ సానుభూతి కోసమే కోడికత్తి దాడి డ్రామాలాడారని డీల్ ఆరోపించారు. గతంలో బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా జగన్ సానుభూతి కోసమే జరిగిందని డీఎల్ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావటానికి సానుభూతి కోసం తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై జగన్ ఎటువంటి దారుణానికైనా పాల్పడే అవకాశముందని.. ఎన్నికలు సమీపిస్తున్నవేళ వారిద్దరు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు మరోసారి అధికారంలోకి రావటానికి జగన్ ఎంతటి దారుణానికైనా దిగజారతారని.. వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని ఇవన్నీ తన దృష్టికి వచ్చాయని డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా జగన్ కోడికత్తి డ్రామా కూడా ఆడారని ఆయన పేర్కొన్నారు. కోడికత్తి దాడి వెనుక కుట్రకోణం లేదని ఎన్ఐఏ కోర్ట్ తెలిపిందని రవీంద్రా రెడ్డి గుర్తుచేశారు. తాడేపల్లి నుంచి వైఎస్ భారతి రాజ్యాంగం నడుస్తోందని.. వివేకా హత్య కేసులో ఎంతమంది అధికారులను మార్చినా నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయనని డీఎల్ స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీలో చేరిన ఆయన ఇటీవల జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుతారని డీఎల్ జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఏపీని కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్‌కు నిజాయితీ వున్నా పాలనలో అనుభవం లేదని డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. సీఎం అయిన నాటి నుంచే జగన్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. వైసీపీలో వున్నందుకు అసహ్యంగా వుందన్నారు. తాను ఇంకా వైసీపీలోనే వున్నానని.. వారేమీ తనను తప్పించలేదని డీఎల్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచే తాను పోటీ చేస్తానని రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు.
సీనియర్ నేత అయినా రవీంద్రారెడ్డి కడప జిల్లా మైదుకూరు నుంచి 1978 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ఘన విజయం సాధించారు . రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా వున్నారు.