TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Andhra Pradesh News | టిడిపి, జనసేన మధ్య విభేదాలు క్షేత్రస్థాయిలో పెరుగుతున్నాయి. నెల్లిమర్లలో లోకం మాధవి వర్సెస్ బంగార్రాజు, అటు దెందులూరు లో జనసైనికులకు చింతమనేని వార్నింగ్ ఇచ్చారు.
Andhra Pradesh Politics | కూటమి ప్రభుత్వం లో అంతా బాగానే ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీనేతల మధ్య పెద్దగా పొసగడం లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కూటమిలోని మూడు పార్టీలలో ముఖ్యంగా టిడిపి జనసేన మధ్య లోకల్ సమస్యలు, నాయకుల ఈగోలు అనవసర రచ్చకు దారితీస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎంత అండర్ స్టాండింగ్ తో ఉంటున్నా లోకల్ గా మాత్రం నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. మొదట్లో బాగానే ఉన్నట్టు కనపడినా నెమ్మదిగా ఈ విభేదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఒకటిగా బయటికి వస్తున్నాయి.
నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే vs టీడీపీ
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి జనసేన నుండి మంచి మెజారిటీతో గెలిచారు. జనసేన ప్రకటించిన తొలి సీటు కూడా ఇదే. ఆమె గెలుపుకు కూటమి పొత్తు చాలా ఉపయోగపడింది. అయితే గెలిచిన నాటి నుంచి స్థానిక టిడిపి నేత బంగార్రాజుతో ఆమెకు విభేదాలు ఏర్పడ్డాయి. ఈమధ్య నెల్లిమర్లలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతుండగా.. బంగార్రాజు ఏదో అడగబోయారు. దానికామె బంగారు రాజును కాసేపు ఆగాలి అన్నారు. దానితో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే వెళ్లిపోయారు. దీనిని టిడిపి అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రతో బంగారు రాజు చెప్పారు. మరికొందరు టిడిపి నేతలు లోకం మాధవి ఎమ్మెల్యే అయింది ఆస్తులు రక్షించుకోవడానికి తప్ప నియోజకవర్గానికి మేలు చేయడానికి కాదంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఈ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది.
దెందులూరులో జన సైనికులకు ఎమ్మెల్యే చింతమనేని వార్నింగ్
పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా దెందులూరు నియోజకవర్గం లోని పైడి చింతలపాడు గ్రామంలో టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజానికి గత కొన్ని రోజులుగా దెందులూరు నియోజకవర్గం లో టిడిపి జనసేన మధ్య సఖ్యత అంతగా ఉండడం లేదు. దీనికి కారణం ఇటీవల వైసిపి నుండి జనసేనలోకి చేరిన కార్యకర్తలే అని టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమిని ఓడించడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు జనసేనలో చేరి పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారనీ, ఇలాంటివి తన దగ్గర కుదరవని చింతమనేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాల్సిందే
ఈ సంఘటనలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిజానికి చాలా చోట్ల ఇలాంటి వైరుధ్యాలు పార్టీల మధ్య ఉన్నాయి. ఆదిలోనే దృష్టి పెట్టాల్సిన అవసరం రెండు పార్టీల అధినేతలపై ఉంది. టిడిపి జనసేన పార్టీల నాయకుల మధ్య క్షేత్ర స్థాయిలో ఉన్న విభేదాలను అధినేతలు సీరియస్ గా తీసుకుని పుల్ స్టాప్ పెట్టకపోతే రాను రాను ఇవే పార్టీల సఖ్యతకు అద్దంకిగా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర రాజకీయాల్లో గట్టిగా వినపడుతోంది.