Endowments Assistant Commissioner arrest: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి భారీగా అక్రమాస్తులు - అరెస్టు చేసిన ఏసీబీ
Shanti arrest: వివాదాస్పద దేవాదాయ శాఖ అధికారిణి శాంతి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

Controversial Endowment Department officer Shanti arrest: వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల దేవాదాయ శాఖాధికారిగా చక్రం తిప్పిన సహాయ కమిషనర్ కళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్న ఆమెపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. విజయవాడ, తాడేపల్లిలోని ఆమె నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం, ఆమెను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు
శాంతి నివాసాల్లో జరిపిన తనిఖీల్లో సుమారు 50 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తుల పత్రాలు, భారీగా బంగారం, భారీగా నగదు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. తన సర్వీసు కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. శాంతిపై ప్రధానంగా దేవాదాయ శాఖ ఆస్తులను పరిరక్షించడంలో వైఫల్యం, ఆలయాలకు నష్టం కలిగేలా వ్యవహరించడం , అధికార దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక కీలక వైసీపీ నేతకు అనుకూలంగా వ్యవహరించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలపై శాఖాపరమైన విచారణ జరిపిన అధికారులు, ఆమె ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని నిర్ధారించారు.
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు కూడా ఆమె అరెస్టుకు ఒక కారణంగా నిలిచాయి. మొదటి భర్త ఎం. మదన్ మోహన్ నుంచి విడాకులు తీసుకోకుండానే, పి. సుభాష్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకోవడం ద్వారా ఏపీ సివిల్ సర్వెంట్ రూల్ 25 ను ఆమె ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఆమెను గత ఏడాది ఆగస్టులోనే సస్పెండ్ చేయగా, తాజాగా ఆమెను సర్వీసు నుంచి తొలగించే ప్రక్రియ కూడా మొదలైంది. అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసినా.. ఆమె హయాంలో జరిగిన భూ కేటాయింపులు, టెండర్ల ప్రక్రియ , ఇతర ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















