CM Jagan : ఏపీలో నక్సల్స్ సంఖ్య 50కి తగ్గింది - గంజాయిని కట్టడి చేశాం - ఢిల్లీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన
ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలను, గంజాయి పంటను కట్టడి చేశామని సీఎం జగన్ తెలిపారు. ఢిల్లీలో అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని.. మావోయిస్టులను పూర్తిగా అదుపు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఢిల్లీలో సీఎం జగన్.. హోంమంత్రి అమిత్ షా ఆధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం మరియ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం– సానుకూల ఫలితాలను అందించిందని సమావేశంలో జగన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోందని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్. pic.twitter.com/PI2ow0bcXU
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 6, 2023
మావోయిస్టుల సంఖ్య 50 మాత్రమే !
ఏపీ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా... మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సరిహద్దులను ఒడిశా, తెలంగాణా మరియు చత్తీస్‌ఘడ్‌లతో పంచుకుంటుంది. పొరుగు రాష్ట్రాలతో పటిష్టమైన సమన్వయం ఉంది. నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్కఫోర్స్ ద్వారా పరస్పరం పంచుకుంటూ... సమిష్టిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు.
గంజాయి పంట 45 ఎకరాల్లోనే !
పేదరికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం మరియు సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలు. సమర్ధవంతమైన విధానాలను రూపొందించి, వాటిని అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపుమాపగలమని జగన్ తెలిపారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 2020–21 నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగను ధ్వంసం చేశారు. 224 కేసులు నమోదు చేసి, 141 మంది నిందితులను అరెస్టు చేశారు. దాదాపు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. నిరంతరాయంగా చేస్తున్న ఈ ఆపరేషన్ వల్ల .... 2022లో గంజాయి సాగు 1500 ఎకరాలకు తగ్గిందని, ప్రస్తుత సంవత్సరం అంటే 2023లో అది కేవలం 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు. గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకునిరావడానికి జిల్లా యంత్రాంగం, పోలీసులు గంజాయి సాగు చేపడుతున్న గిరిజనులతో సంప్రదించి.. వారికి ప్రత్యామ్నాయ పంటలైన కాఫీ, నిమ్మ, జీడి మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్ ఓక్‌తో పాటు రాజ్మా, కందిపప్పు, వేసుశెనగ వంటి పంటలసాగును ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తద్వారా వారిని గంజాయి సాగు నుంచి మరల్చే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
మావో ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం
మావో ప్రభావిత ప్రాంతాల్లో రహదారులతో అనుసంధానం అన్నది అత్యంత కీలకమైన అంశమని దీన్ని ప్రాధాన్యతగా తీసుకున్నామన్నారు. ఇప్పటికే 1087 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసామన్నారు.
ప్రభుత్వ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా, పారదర్శకంగా మరియు త్వరితగతిన అందజేయడం కోసం మేము 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కూడా ఉన్నారు. కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో భాగంగా మొబైల్ కనెక్టివిటీ పెంచడం కోసం 944 కమ్యూనికేషన్ టవర్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1953 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు మరియు 81 గురుకుల పాఠశాలలు, 378 ఆశ్రమ పాఠశాలలతో పాటు 179 ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తోంది. వీటిని మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల కల్పిస్తూ... డిజిటలైజేషన్ పరంగా తరగతిగదులన్నింటినీ అప్‌గ్రేడ్ చేస్తున్నాం. మరోవైపు పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్ధిక సహాయం అందించేందుకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి రూ.15,000 అందిస్తున్నామన్నారు.
వైజాగ్‌లో గ్రే హౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలి !
గతంలో సదరన్ జోనల్ కౌన్సిల్‌లో సిఫార్సు మేరకు వైజాగ్‌లో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని సైతం కేటాయించి దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. దీనిని వీలైనంత త్వరగా మంజూరు చేయగలరు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతరం పరస్పర సహాయ సహకారాలు అవసరcvdvejg. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ... వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు.. అక్కడ పోలీసు బలగాల ఆధునీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్ధిక మరియు వ్యూహాత్మక మద్ధతును కేంద్రం అందించడం అన్నది చాలా కీలకమని విజ్ఞప్తి చేశారు.