దసరా నుంచి విశాఖలోనే సీఎం క్యాంప్ ఆఫీస్, ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో యంత్రంగం తరలింపు
ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతి సౌకర్యం పొడిగించిన వెనుక మతలబు ఉందంటున్నారు ఉద్యోగులు. ఉచిత వసతి సౌకర్యానికి ఒప్పుకుంటే, అమరావతి నుంచి వైజాగ్ వెళ్లేందుకు అంగీకరించినట్లేని అంటునారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అధికార యంత్రాంగాన్ని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. విజయదశమి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజధాని తరలింపు అనే పేరు లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి అని కలరింగ్ ఇస్తోంది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పేరుతో అధికారులు తరచూ అక్కడికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సాకుతో సీనియర్ అధికారులు, శాఖాధిపతులు అక్కడికి రావాలని ఉత్తర్వులో పేర్కొంది. అధికారులు విశాఖలో ఉండేందుకు ట్రాన్సిట్ వసతి కోసం కమిటీ వేసింది. మంత్రులు, సీనియర్ అధికారులు అక్కడ ఉండేందుకు వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఎంకు సహాయపడేందుకు మిగతా అధికారులు కూడా విశాఖలో ఉండేలా ఏర్పాట్లకు కమిటీ నియమించింది. పాలనా రాజధాని విశాఖకు తరలివెళ్తుండటంతో, వెనుకబడిన తమ సంగతేంటని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతి సౌకర్యం గడువును వచ్చే జూన్ 26వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వసతి పొడిగింపుపై సెప్టెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతి సౌకర్యం పొడిగించిన వెనుక మతలబు ఉందని కొందరు ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉచిత వసతి సౌకర్యానికి ఒప్పుకుంటే, అమరావతి నుంచి వైజాగ్ వెళ్లేందుకు అంగీకరించినట్లేనని చెబుతున్నారు. ఉచిత సౌకర్యాన్ని ఎందుకు పొడిగించారో డైరెక్ట్ చెప్పకుండా దొడ్డిదారిలో వివరాలు సేకరిస్తోందని ప్రభుత్వంపై కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం, వామపక్ష తీవ్రవాదం, గిరిజనులు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీసు, బస గుర్తింపు కోసం కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ , సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులతో కూడిన కమిటీని నియమించింది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సీఎం సమీక్షించాల్సి ఉందని, దీని కోసం ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది. జీవో 2015 సీఎస్ జవహర్‌రెడ్డి విడుదల చేశారు.
హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగుల ఉచిత వసతి వివరాలు సేకరిస్తోంది. ఉచిత వసతి పొందే ఉద్యోగుల పూర్తి వివరాలు పంపించాలని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలకు సాధారణ పరిపాలన శాఖ నోట్ పంపింది. సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్, హైకోర్టు ఉద్యోగులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ముందుగా అత్యవసరంగా ఉద్యోగుల ఐడీ నకళ్లు పంపించాలని హెచ్‌వోడీలకు ఆదేశాలు జారీ చేసింది. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకూ ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి సదుపాయాలను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిదేళ్లుగా విజయవాడ, గుంటూరు నగరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించిన వసతి సదుపాయాలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, హెచ్‌వోడీలు, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు ఈ వసతి సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.