CM Jagan Delhi Tour: నేడు సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్ - రేపు ప్రధానితో భేటీ
రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
సీఎం జగన్‌కు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన శుక్రవారం (మార్చి 17) ప్రధానిని కలవనున్నట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఇందుకోసం నేడు (మార్చి 16) సాయంత్రమే సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోనున్నారు. అక్కడి నుంచి 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాత్రి 7.15 నిమిషాలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నివాసానికి వెళ్లి అక్కడే బస చేయనున్నారు.
అమిత్ షాతో కూడా భేటీ
సీఎం జగన్ ఎప్పటిలాగే రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోదీని అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది. మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికి జగన్ ఇస్తారని తెలుస్తోంది.
జులైలో విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఇప్పటికే కేబినెట్ భేటీలో జగన్ మంత్రులకు స్పష్టత ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
కాసేపటి క్రితం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం జగన్, బడ్డెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత క్యాంపు ఆఫీసులో ఢిల్లీలో చర్చించాల్సిన అంశాలపై నేతలు, అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి కావడం, విభజన హామీల అమలులో కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడం, మరోసారి ఎన్నికలు రానున్న వేళ జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఈ నాలుగేళ్లలో ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు సీఎం జగన్. అయినా ఆయన కేంద్రం నుంచి ఏమీ రాబట్టుకోలేదని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఏపీ బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లు
ఏపీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవెన్యూ లోటు 22,316గా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.54,587 కోట్లు కాగా, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్యలోటు 1.54 శాతంగా చూపించారు.