AP Assembly: సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ పేరు, అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన
AP Budget Session: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఏపీ అసెంబ్లీలో మంగళవారం సంతాప తీర్మానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తీర్మానంపై చర్చ జరిగింది.
Mekapati Gowtham Sangam Barrage: మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టనున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని, ప్రారంభోత్సవం సందర్భంగా మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ అని పేరు పెట్టనున్నట్లుగా సీఎం జగన్ వెల్లడించారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా కల్పించారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఏపీ అసెంబ్లీలో మంగళవారం సంతాప తీర్మానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తీర్మానంపై చర్చ జరిగింది. మంత్రులు, పార్టీ నాయకులు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సంతాప తీర్మానంపై చర్చలో భాగంగా చివరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. గౌతమ్ రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. గౌతమ్ రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరంగా ఉందని అన్నారు.
గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన మేరకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కాలేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టి, అగ్రికల్చర్, హార్టీకల్చర్ కాలేజీగా మార్చుతామని చెప్పారు. ప్రభుత్వం దాని బాధ్యతను తీసుకొని మంచి వ్యవసాయ కోర్సులను ప్రవేశపెడతామని చెప్పారు. ఉదయగిరి ప్రాంతాన్ని వెలిగొండ ఫేస్ 1 పనుల కిందికి తీసుకొచ్చి సాగునీటిని అందిస్తామని సీఎం చెప్పారు. ఉదయగిరిలోని డిగ్రీ కాలేజీలో వసతులను కూడా నాడు-నేడు పనుల్లో భాగంగా మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు.
కొత్త కంపెనీలు రావడంలో కీలక పాత్ర: సీఎం
చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి చేశారని తెలిపారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదాలు లేని వ్యక్తి అని అన్నారు. ఇలా గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన చెందారు. తాను తొలిసారి పోటీ చేసిన నాటి నుంచి 2010 నుంచి ఇద్దరం సన్నిహితగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మంత్రి అనిల్ ప్రార్థించారు.
సంతాప తీర్మానంపై నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. మేకపాటి గౌతమ్ రెడ్డి అజాత శత్రువు అని గుర్తు చేసుకున్నారు. వివాదాలు లేని వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారని అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాకుండా.. తోటి రాజకీయ నేతలు, విపక్ష నేతల మెప్పుకూడా పొందిన వ్యక్తి అని అన్నారు. సీఎం జగన్‌కు గౌతమ్ రెడ్డి నిజమైన సైనికుడని అభివర్ణించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డి మరణంపై ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.