Lokesh Padayatra : లోకేశ్ పాదయాత్రకు సాధారణ నిబంధనలే విధించాం, బహిరంగ సభలు అక్కడొద్దు- ఎస్పీ రిశాంత్ రెడ్డి
Lokesh Padayatra : టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. లోకేశ్ పాదయాత్రకు అన్ని విధాలుగా సహకరిస్తామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
Lokesh Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు పోలీసు శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం చిత్తూరు ఎస్పీ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో నారా లోకేశ్ పాదయాత్రపై అసత్య ప్రచారం చేస్తున్నారని, పాదయాత్రకు అనుమతులు ఇవ్వలేదని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. పోలీసుల నిబంధనల మేరకే నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టాలని సూచించారు. లోకేశ్ పాదయాత్రకు సాధారణంగా అమలు చేసే నిబంధనలు మాత్రమే విధించామన్నారు. పాదయాత్ర అంతా నేషనల్ హైవేపై జరుగుతున్న క్రమంలో అత్యవసర వాహనాలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాదయాత్ర నిర్వహించాలని తెలిపామన్నారు. బహిరంగ సభలకు ప్రైవేటు ప్రదేశాల్లో నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చామని, రోడ్లల్లో, సందుల్లో మాత్రమే బహిరంగసభలు నిర్వహించరాదని చెప్పామన్నారు. సాధారణంగా ఏ సిటిజన్ అప్లై చేసుకున్న ఇదే నిబంధనలు వర్తిస్తాయని, పాదయాత్రకు సంబంధించిన నిబంధనల్లో ఎటువంటి మార్పు అవసరం అయితే చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. అంతే కాకుండా నారా లోకేశ్ పాదయాత్ర జిల్లాలో పూర్తయ్యేంత వరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అనుమతి
ఈ నెల 27వ తేదీన కుప్పం నుంచి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజస్వామి ఆలయంలో నారా లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత కుప్పంలోని బీఆర్ అంబేడ్కర్, ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సివిల్ కేసులు ఎదుర్కొంటున్న మహిళా కార్యకర్తలతో నారా లోకేశ్ సమావేశం కానున్నారు. అదే రోజు 4.45 గంటలకు కమతమూరు రోడ్‌లో గంట పాటు బహిరంగ సభ నిర్వహించడంతో పాటుగా పలు వర్గాలతో సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటలకు పీఈఎస్ వైద్య కళాశాల సమీపంలో బస చేయడంతో తొలి రోజు యాత్ర ముగుస్తుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు పాదయాత్ర మొదలుకానుంది. 28వ తేదీ ఉదయం 8.10 గంటల నుంచి గంట పాటు యువతతో సమావేశమై వారి ప్రశ్నలకు సమాధాన మివ్వనున్నారు. అదే రోజు సాయంత్రం 5.50 గంటలకు పాదయాత్ర పూర్తి అవుతుంది. 29న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కొనసాగునుంది. మూడోవ రోజు సాయంత్రం 5.55 గంటలకు రామకుప్పం మండలం, చెల్దిగానిపల్లెకు చేరడంతో కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర ముగుస్తుంది.