Kuppam High Tension : గుడిపల్లిలో హైటెన్షన్, రోడ్డుపై కూర్చొని చంద్రబాబు నిరసన!
Kuppam High Tension : కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. గుడిపల్లి పీఎస్ లో ఉన్న చైతన్య రథాన్ని అప్పగించాలని చంద్రబాబు నిరసనకు దిగారు
Kuppam High Tension : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నేడు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు చంద్రబాబు మూడో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ధర్నాకు దిగారు. శుక్రవారం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. తర్వాత ఇదే క్రమంలో గ్రామాల్లో ఇంటింటి పర్యటనకు సిద్ధమయ్యారు. గుడిపల్లి మండలంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించాల్సి ఉండగా.. చంద్రబాబు రోడ్ షోలకు అనుమతి లేదని పోలీసులు ప్రచార చైతన్య రథాన్ని అడ్డుకున్నారు. భారీగా పోలీసులు మోహరించి రథాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా గుడిపల్లి పీఎస్‌లోనే చంద్రబాబు చైతన్య రథం ఉంది. చైతన్య రథాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నిరసనకు దిగారు. నడిరోడ్డుపై టీడీపీ శ్రేణులతో కలిసి కూర్చొని నిరసన తెలిపారు. దీంతో కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించారు.
కుప్పం పర్యటనలో ఆంక్షలు విధించడం, పోలీసులు తన ప్రచార వాహనం ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ గుడుపల్లి లో బైఠాయించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ తీరుకు ఆగ్రహిస్తూ ... స్వయంగా బస్సుపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు#CBNInKuppam #RIPDemocracyInAP pic.twitter.com/xkxnKrlsT4
— Telugu Desam Party (@JaiTDP) January 6, 2023
చంద్రబాబు ధర్నా
గుడిపల్లి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. టీడీపీ కార్యాలయానికి వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తన ప్రచార రథం అప్పగించాలని చంద్రబాబు పోలీసులను డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గుడిపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు.
పోలీసులు బానిసలుగా బతకొద్దు
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు గుడిపల్లికి రాకుండా పోలీసులు మూడు మార్గాల్లో అడ్డుకోవడమేంటని మండిపడ్డారు. పోలీసులు బానిసలుగా బతకొద్దని హితవుపలికారు. చట్టప్రకారం విధులు నిర్వర్తించాలని కోరారు. తన నియోజకవర్గంతో తాను పర్యటించకుండా చేసి తిరిగి పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ తాను వెళ్లనన్నారు. పోలీసులనే ఇక్కడ నుంచి పంపిస్తానన్నారు. సీఎం, ఆయన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు పోరాడం చేస్తానని చంద్రబాబు అన్నారు. తన గొంతు 5 కోట్ల మంది ప్రజలదన్న చంద్రబాబు... ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు తావులేదన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులు పారిపోతున్నారన్నారు. చట్టాన్ని అమలు చేయకుండా పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడితే ఏం చేయగలరని ప్రశ్నించారు. ఎంత మందిని అరెస్టు చేస్తారని, ఎన్ని జైల్లు, పోలీస్‌స్టేషన్లు ఉన్నాయని నిలదీశారు. జీవో నంబర్ 1 చట్టవిరుద్ధమని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సీఎం జగన్ మీటింగ్ పెట్టి, రోడ్‌షో చేయలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు రోడ్డు షోలు నిర్వహించడంలేదా అని నిలదీశారు. రాష్ట్రంలో జగన్ కో రూలు.. తనకో రూలా? అని ప్రశ్నించారు. పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూస్తే ప్రజలు సహకరిస్తారన్నారు. ే