Chittoor News: కుటుంబ భారం మోస్తున్న చిన్నారి... ఆటో రిక్షా నడుపుతూ కుటుంబ పోషణ... ఆదుకుంటామని నారా లోకేశ్ హామీ
తోటి చిన్నారులతో కలిసి ఆడుకునే వయసులో కుటుంబ భారాన్ని మోస్తున్నాడో ఓ బాలుడు. ఆ బాలుడు కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఆడుతూ..పాడుతూ హాయిగా గడిపే వయసు బాల్యం. వయస్సులో కష్టం అంటే తెలియనీ జీవితం వారిది. సంపాదన, కుటుంబభారం అంటే ఏంటో తెలియని పసి మనసు. కానీ ఆ చిన్నారికి మాత్రం ఎవరికి రానంత కష్టం వచ్చింది. కుటుంబ బాధ్యతలు ఆ బాలుడి భుజాలపై పడింది. అమ్మ, నాన్నలతో సహా ఇద్దరు తమ్ముళ్ల పోషణకు కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. ఒక్కరోజు పనికి వెళ్లకుంటే ఆ కుటుంబంలో ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితి. కుటుంబ పోషణకు ఆ బాలుడి పడుతున్న శ్రమను చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి.
Eight-year-old boy of visually impaired #AndhraPradedh couple drives auto to make ends meet. The boy who is the eldest sibling in his family has taken to driving an electric auto to help his dim sighted parents in earning. pic.twitter.com/kSdRuzWqHq
— Aashish (@Ashi_IndiaToday) September 3, 2021
తల్లిదండ్రులు అంధులు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కారులో ప్రయాణిస్తున్నాడు ఓ యువకుడు. వెళ్లే దారిలో బ్యాటరీ ఆటోను చూశాడు. ఆటో నడిపే వ్యక్తిని చూసి ఆ యువకుడు షాక్ తిన్నాడు. ఆ బ్యాటరీ ఆటో నడుపుతోంది ఎనిమిదేళ్ల బాలుడు రాజగోపాల్ రెడ్డి. పసివాడైన రాజగోపాల్ రెడ్డి ఆటో నడపడాన్ని గుర్తించిన ఆ యువకుడు. వెంటనే వాహనాన్ని ఆపి, ఇంత చిన్న వయసులో ఎందుకు ఆటో నడుపుతున్నావని ప్రశ్నించారు. ఆ ఆటోలో వెనుక కూర్చుని ఉన్న వ్యక్తి నుంచి అనూహ్య సమాధానం వచ్చింది. తాను రాజగోపాల్ రెడ్డి తండ్రినంటూ సమాధానం ఇచ్చాడు. తనకు ముగ్గురు కుమారులు, మొదటి కుమారుడు రాజగోపాల్ మరో ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. తాము అంధులమని సమాధానం ఇచ్చాడు.
కుటుంబ అవసరాలకు కోసం
చిత్తూరు జిల్లాలోని గంగులపల్లిలో నివాసం ఉంటున్న రాజగోపాల్ కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్నాడు. పల్లెల్లో తిరుగుతూ ఆ బ్యాటరీ ఆటోలోనే పప్పు, ఉప్పు, నిత్యవసర పదార్థాలను విక్రయిస్తూ ఉంటారు. ఒక్కరోజు రాజగోపాల్ ఆటో నడపకపోతే ఆ రోజంతా పస్తులుండాల్సిన పరిస్థితి. చదువుకునే వయసులో బాలుడు ఆటో రిక్షా నడపడం చట్టరీత్యా నేరమైనప్పటికీ కుటుంబ అవసరాలను తీర్చేందుకు తప్పడం లేదు. తమ కుటుంబ పోషణకు యాచించకుండా తన కాళ్లపై తాను నిలబడాలని రాజగోపాల్ సంకల్పం చూసి మెచ్చుకోకతప్పదు. ప్రభుత్వ అధికారులు చొరవ చూపి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామస్తులు, చుట్టు పక్కల వారు ఆ కుంటుబానికి తమకు తోచిన ఆర్థిక సాయం అందిస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
Ask him to pack his bag because we're getting him admitted to a school soon. We'll also come together to help his family cover the EMI cost of the electric auto through a fundraiser towards which @JaiTDP pledges to contribute Rs. 50,000/- https://t.co/Q9q3F7maZE
— Lokesh Nara (@naralokesh) September 3, 2021
స్పందించిన లోకేశ్...
8 ఏళ్ల బాలుడు గోపాలరెడ్డి కుటుంబానికి సాయం అందించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుకు వచ్చారు. తక్షణసాయంగా రూ.50 వేలు ఇస్తానని ప్రకటించారు. బ్యాటరీ ఆటో కోసం చేసిన అప్పు తీర్చేందుకు టీడీపీ రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించనుందని వెల్లడించారు. తల్లిదండ్రులు, గోపాలరెడ్డి కోరిక మేరకు ఏ స్కూల్లో చదవాలనుకుంటే అక్కడ విద్యాభ్యాసానికి అయ్యే మొత్తం ఖర్చు భరిస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఎనిమిదేళ్ల వయస్సులో కుటుంబ బాధ్యతల్ని మోస్తోన్న బాలుడ్ని చూసి లోకేశ్ చలించిపోయారు. బాలుడిపై మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి.